● మూలపేట– విష్ణుచక్రం గ్రామస్తుల మధ్య వాగ్వాదం
● పరిస్థితిని చక్కదిద్దిన అధికారులు
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులకు నౌపడ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో కేటాయించిన స్థలాల్లో ఆలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు శనివారం వివాదానికి దారితీసింది. తమ కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించాలని గతంలో మూలపేట గ్రామస్తులు కోరగా, అధికారులు ఆ స్థలాన్ని వారికి కేటాయించారు. పార్కు కోసమని చెప్పడం వల్లే ఆ స్థలాన్ని తాము ఆలయ స్థలాల కోసం కోరలేదని, తమ గ్రామానికి చెందిన ఆలయాలకు కూడా స్థలం కేటాయించాలని విష్ణుచక్రం గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విష్ణుచక్రం గ్రామస్తులు సంబంధిత స్థలంలో జెండాలు ఏర్పాటు చేయడంతో ఇరు గ్రామాల ప్రజల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలయ స్థలాల కేటాయింపుపై గతంలో పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో ఐదోసారి తహసీల్ధార్ హేమసుందరరావు సమక్షంలో ఇరు గ్రామాల ప్రజలతో చర్చ జరిగింది. పోర్టు నిర్మాణం కోసం తాము కూడా తమ భూములను త్యాగం చేశామని, తమ గ్రామంలోని ఆలయాలకు స్థలాలు కేటాయించాలని విష్ణుచక్రం గ్రామస్తులు కోరారు. గతంలో ఆలయాలకు చెరువు గట్టు ప్రాంతంలో స్థలాలు కేటాయించారని, చూపించిన స్థలం ఆలయ నిర్మాణానికి అనువుగా లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దార్ ఇరు గ్రామాల ప్రజలతో మాట్లాడి విష్ణుచక్రం గ్రామస్తుల ఆలయాల కోసం మరోచోట 15 సెంట్లు స్థలాన్ని చూపించారు. ఈ స్థల వివరాలను ఆర్డీవోకు తెలియజేసి నిబంధనల ప్రకారం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్ హామీ ఇచ్చారు. దీంతో విష్ణు చక్రం గ్రామస్తులు అంగీకరించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ నిర్ణయంతో పార్కు కోసం కేటాయించిన స్థలం మూలపేట గ్రామస్తులకు దక్కగా, విష్ణుచక్రం గ్రామస్తులకు ప్రత్యామ్నయంగా 15 సెంట్లు స్థలం కేటాయించే మార్గం సుగమమైంది. ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం అంగీకరించడంతో వివాదానికి తెరపడింది.


