● ఏటీఎంలో డబ్బులు వెనక్కి వస్తున్న వైనం
● జిల్లాకేంద్రంలోని అరసవల్లి మిల్లు జంక్షన్‌లోని ఏటీఎం వద్ద సంఘటన
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్ ఏటీఎం మిషన్ల వద్ద ఖాతాదారులు జాగ్రత్తగా మసలుకోవాల్సి వస్తోంది. అరసవల్లి మిల్లు కూడలి సమీపంలోని ఏటీఎం సెంటర్ వద్ద ఓ యువకుడు రూ. 5 వేలు విత్‌డ్రా చేస్తే రాకపోవడం, ఆ తర్వాత వచ్చిన కస్టమర్ అదే మిషన్ వద్దకు వెళ్తే నోట్లు ఉండటం శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇదే తరహాలో ఇటీవల జీటీరోడ్డులోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి ఏటీఎం సెంటర్ వద్ద రూ. 17 వేలు డిపాజిట్ చేసిన వంశీకృష్ణ అనే వ్యక్తికి నగదు ఖాతాలోకి జమ కాకపోవడం, తర్వాత వచ్చిన కస్టమర్‌కు నోట్లు రావడం తెలిసిందే. ట్రాఫిక్ సీఐ వి.రామారావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. సాది లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఏటీఎం సెంటర్‌కు వెళ్లి ముందుగా ఓ మిషన్‌లో రూ. 5 వేలు విత్‌డ్రా చేశాడు. డబ్బులు రాకపోవడంతో మరో మిషన్ వద్దకు వెళ్లి రూ. 3 వేలు విత్‌డ్రా చేశారు. అదే సమయంలో మొదటి మిషన్ వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన హోంగార్డు పట్నాయకుల వెంకటరావుకు రూ. 5 వేలు కనిపించాయి. వెంటనే పక్కనే ఉన్న బ్రాంచి మేనేజర్‌కు విషయం చెప్పగా విత్‌డ్రా చేసిందెవరన్నది ఆన్‌లైన్‌లో గుర్తించి (లక్ష్మీ నారాయణరెడ్డిదిగా) వెంకటరావుతో ఆయన అకౌంట్‌లో రూ. 5 వేలను డిపాజిట్ చేయించారు. అనంతరం లక్ష్మీనారాయణ రెడ్డిని ఫోన్ ద్వారా బ్యాంకుకు రప్పించి విషయాన్ని చెప్పారు.


