కారణాలు ఇవే..
సరైన ఆహారం అందించాలి..
● పోషకాహార లోపంతో చిన్నారులు ● ప్రతి ఐదుగురిలో ఒకరు బాధితులు ● నెరవేరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం ● పౌష్టికాహారం అందిస్తున్నా ఫలితం శూన్యం
హిరమండలం:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ఖర్చుతో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ముఖ్యంగా పోషకాహార లోపంతో చిన్నారులు బాధపడుతున్నారు. ఎదుగుదల లోపం, బరువు తక్కువ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆగస్టులో అంగన్‌వాడీ కేంద్రాల్లో 79,943 మంది చిన్నారుల ఎత్తు, బరువును కొలిచారు. 15,819 మంది ఎత్తుకు తగ్గట్టు బరువు, వయసు తగినట్టు ఎత్తు, బరువు లేకపోవడాన్ని గుర్తించారు. ఏకంగా 10.81 శాతం మంది తీవ్ర, పాక్షిక ఎదుగుదల లోపాలతో బాధపడుతుండటం గమనార్హం. ప్రతి ఐదుగురి చిన్నారుల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్యకరమైన బాల్యానికి ఎంతో మంది దూరమవుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 6,496 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 95,633 మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా గుడ్లు, పాలు అందిస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యతో పాటు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారు. కొత్తగా మెనూలో ఎగ్ ఫ్రైడ్‌రైస్, ఉడికించిన శనగలు వంటి పోషక పదార్థాలను సైతం చేర్చారు. గర్భిణులు, బాలింతలకు రాగిపిండి, బెల్లం, వేరుశెనగ చిక్కీ, ఎండు ఖర్జూరం వంటి పోషకాహారం ఇస్తున్నారు. అయినా సరే కొంతమంది చిన్నారులకు సరైన పోషకాలు అందక తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో 712 మంది ఉన్నట్టు గుర్తించారు. మధ్యస్థ పోషకాహార లోపం ఉన్న బాలలు 2,325 మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరితో పాటు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉన్నవారు 4,142 మంది ఉన్నారు.
జిల్లాలో చాలా ఐసీడీఎస్ ప్రాజెక్టులపై అనేక రకాల విమర్శలున్నాయి. కొంతమంది అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున సరుకులు పక్కదారి పట్టించినట్టు ఫిర్యాదులు వస్తున్నా యి. ఐసీడీఎస్‌లో ప్రధాన లోపం పర్యవేక్షణ లేకపోవడం, మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పోషకాహారాన్ని ఇళ్ల వద్ద చిన్నారులకు ఇవ్వడం లేదు. మేనరికం, బాల్య వివాహాలు కారణంగా జన్యుపరమైన లోపాలు, తక్కువ బరువుతో పుట్టడం పిల్లలకు శాపంగా మారుతోంది. చిన్నారుల చుట్టూ పరిశుభ్రత లేకపోవ డం కూడా ఒక ప్రధాన కారణం. విటమిన్లు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్‌తో కూడిన ఆహారం అందకపోవడం, జంక్ ఫుడ్ అలవాటు చేయ డం కూడా పోషకాహారం అందక చిన్నారుల్లో ఎదుగుదల లోపిస్తోంది.
ఆరేళ్లలోపు ప్రతి చిన్నారికి విధిగా ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్‌లు ఉండే సమతుల ఆహారం అందించాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో సూచించినట్టు పిల్లలకు బాలామృతం, పప్పు దినుసులు, గుడ్లు పెట్టాలి. వయసుకు తగ్గ బరువు, ఎత్తులేని పిల్లలను ఎప్పటికప్పుడు కేంద్రాల్లో తూకం వేయాలి. వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శ్రీకాకుళం రిమ్స్‌లో పోషకాహార లోపంతో బాధపడేవారికి ప్రత్యేకంగా ఎంఆర్‌సీ కేంద్రం అందుబాటులో ఉంది. – బి.ఉమాజానకి, ఐసీడీఎస్ సీడీపీఓ, కొత్తూరు


