ఎల్.ఎన్.పేట: కోవిలాం కాలనీ సమీపంలో ఏబీ రోడ్డు పక్కన కాలువలో ఓ లారీ బోల్తా పడింది. డ్రైవర్ సూరినాయుడు తెలిపిన సమాచారం మేరకు శుక్రవారం వేకువజామున బత్తిలి నుంచి కర్రల లోడుతో అనకాపల్లి సమీపంలోని అచ్యుతాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీని రోడ్డు పక్కన బహిర్భూమి కోసం ఆపామని, తనతో పాటు క్లీనర్ లారీలో ఉండగా ఒక్కసారిగా పక్కకు ఒరుగుతూ కాలువలో పడిపోయిందని డ్రైవర్ చెప్పారు. ఇద్దరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పులిబంద గ్రామానికి చెందిన సంకిలి అప్పారావు(35) బుధవారం రాత్రి తన ఇంటి శ్లాబ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పారావుకు 13 ఏళ్ల క్రితం పాతపట్నం మండలం బడ్డుమర్రి గామానికి చెందిన రాజేశ్వరితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కొద్ది నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అప్పారావు గురువారం రాత్రి చీరతో ఉరివేసుకున్నాడు. అయితే కుమారుడి మృతిపై తల్లి కర్రెమ్మ అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు.
సెంట్రల్ జైలుకు గంజాయి నిందితుడు
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం నగరం, రూరల్ పీఎస్ పరిధిలో 2 గంజాయి కేసుల్లో నిందితునిగా ఉన్న జలగడుగుల తారావికాస్ అలియాస్ వికాస్‌ను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. ఈ మేరకు రూరల్ సీఐ కె.పైడపునాయుడు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గంజాయి నేర కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని పీఐటీ–ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నిర్బంధానికి పంపించగా సంబంధిత అధికారులు పరిశీలించి ఏడాది కాలం నిర్బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు.
ఐరన్ చోరీకి యత్నం
రణస్థలం: రణస్థలం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనుల్లో వినియోగిస్తున్న ఐరన్‌ను కొంతమంది వ్యక్తులు నిత్యం దొంగిలిస్తున్నారని గుర్తించిన కాంట్రాక్ట్ కాపలాదారులు నిఘా వేయగా ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండ్‌గా శుక్రవారం పట్టుకున్నారు. గతంలో ఇలాగే పలుమార్లు దొంగతనం చేసి తుక్కు దుకాణంలో అమ్మేశారని ఎస్‌ఈపీఎల్ సూపర్‌వైజర్ జగదీష్ తెలిపారు. అనంతరం నిందితుడిని జె.ఆర్.పురం పోలీసులకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
టెక్కలి రూరల్: నర్శిపురం జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన వై.శ్రీరాములు తన భార్య చిన్నప్పమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై పలాస నుంచి టెక్కలి వైపు వస్తుండగా నర్శిపురం జంక్షన్ వద్ద కుక్కలు అడ్డుగా రావడంతో కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడటంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఫర్నిచర్ షాపులో మంటలు
జి.సిగడాం(పొందూరు): పొందూరు మండల కేంద్రంలో సిస్టమ్ కాలేజీ మొయిన్ రోడ్డు సమీపంలో ఫర్నిచర్ షాపులో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సమారు రూ.4లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు నల్లబారిక పైడిరాజు, నల్లబారిక వెంకటరమణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గల్లంతైన వ్యక్తి మృతదేహం
లభ్యం
బూర్జ: లాభాం గ్రామ సమీపంలో నాగావళి నది ఒడ్డున మర్రి చెట్టు వద్ద తుప్పల్లో చిక్కుకున్న మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పనస నందివాడ గ్రామానికి చెందిన పాలకొండ సుబ్బారావు(62) ప్రతిరోజు ననసనందివాడ నుంచి రేగిడి మండలం కందిస గ్రామాల మధ్య నాగావళి నదిలో పడవ నడుపుతుంటాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు రావడంతో సుబ్బారావు తన మిత్రుడు నాగుడు సహాయంతో పడవ తీయగా ఇంజన్ స్టార్ట్ కాలేదు. దీంతో తెడ్డు సహాయంతో పడవ నడుపుతుండగా తెడ్డు జారిపోయింది. సుబ్బారావు తెడ్డుకోసం నదిలోకి దూకి గల్లంతయ్యాడు. ఎట్టకేలకు మృతదేహం లభించడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
క్రైమ్ కార్నర్


