శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) 13వ రాష్ట్ర మహా సభలు నెల్లూరులో ఈ నెల 3, 4వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో జిల్లా ప్రతినిధులు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, జూనియర్ అడ్వకేట్స్‌కు రూ.పది వేలు స్టయిఫండ్, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీ, కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సభల్లో చర్చించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎస్.అప్పారావు, జనరల్ సెక్రటరీ దుంపల రమణారావు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పైడి లక్ష్మీపతి, సెక్రటరీ డొంకాన ఈశ్వరరావు, అంధవరపు వెంకటేశ్వరరావు, సాయికిషోర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
గార: ప్రతి ఖైదీకి ఉచితంగా న్యాయ సహాయం పొందే హక్కు ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శుక్రవారం అంపోలు జిల్లా జైలులో గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెయిల్, ప్లీ బార్గేనింగ్, జైలు అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం గురించి టోల్ ఫ్రీ నెంబర్ 15100 ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం ఖైదీలు దేశభక్తి గీతాలు, గాంధీజీ భజనలు ఆలపించారు.
వీఆర్‌ఓల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఢిల్లీశ్వరరావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా సరుబుజ్జిలి మండలం వీఆర్‌వో గంగు ఢిల్లేశ్వరరావు ఎన్నికయ్యారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో పదవి దక్కడంతో రెవెన్యూ ఉద్యోగుల తరఫున జేఏసీ ఏపీ అమరావతి శ్రీకాకుళం చైర్మన్ భైరి రాజు, మహిళా విభాగం చైర్‌పర్సన్ కె.ప్రవల్లిక ప్రియ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.రాజేష్ కుమార్, జిల్లా సెక్రటరీ బి.రాంజీ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను కాపాడండి
శ్రీకాకుళం : మాతృభాష మాధ్యమం కొనసాగింపు ద్వారా మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న, ప్రధాన కార్యదర్శి ఎన్ని వెంకట ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం డీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలోని స్మృతివనం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో డీటీఎఫ్ నాయకులు కోత ధర్మారావు, మిస్కా కృష్ణయ్య, కొమ్ము అప్పలరాజు, కోటిపాత్రుని కొండయ్య, ఎన్ని రమణమూర్తి, గొల్లపల్లి మౌళి, గురుగుబెల్లి రమణమూర్తి, గురుగుబెల్లి భాస్కరరావు, సనపల లక్ష్మణరావు, డి.గణేష్, చింతాడ పార్వతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
కంచిలి : పశువుల అక్రమ రవాణాను కంచిలి పోలీసులు అడ్డుకున్నారు. కోటబొమ్మాళి మండలం నారాయణవలస గ్రామానికి చెందిన ఉరజాన సింహాచలం జాతీయ రహదారి మీదుగా బొలేరో పికప్ వాహనంలో 10 పశువులను తరలిస్తూ, పాతపట్నం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఉరజాన పవన్ ఏడు పశువులను తరలిస్తుండగా పట్టుబడ్డారు. వాహనాలను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు.
ఆకలైన వేళ అమ్మలా..
నరసన్నపేట: నరసన్నపేట పాతబస్టాండ్ వద్ద ఉమామహేశ్వరి ఆలయం సమీపంలో మెయిన్ రోడ్డు పక్కన ఒక ఆవు శునకానికి పాలిచ్చిన దృశ్యం స్థానికుల కంట పడింది. శుక్రవారం వేకువజామున ఆవు చెత్తకుప్ప వద్ద ఆహారం కోసం చూస్తుండగా అటుగా వచ్చిన శునకం నేరుగా ఆవు వద్దకు వెళ్లి పాలు తాగేందుకు ప్రయత్నించగా ఆవు కదలకుండా పాలిచ్చి ఆకలి తీర్చింది.


