● రేపు జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు
● జూనియర్స్, సబ్–జూనియర్స్ విభాగాల్లో పోటీలు
● శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఏర్పాట్లు
శ్రీకాకుళం న్యూకాలనీ: కబడ్డీ కూతకు వేళయ్యింది. గత కొన్నాళ్లుగా కబడ్డీ క్రీడలో రాణించాలనే కాంక్షతో సాధన చేస్తున్న క్రీడాకారులకు జిల్లా కబడ్డీ సంఘం తీపికబురు అందించింది. రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా జూనియర్స్, సబ్–జూనియర్స్ విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఈ ఎంపికల ప్రక్రియను పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎంపికలు మ్యాట్‌పై నిర్వహించనున్న నేపథ్యంలో క్రీడాకారులంతా తప్పనిసరిగా మ్యాట్ షూ ధరించి హాజరుకావాల్సి ఉంటుంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు తమ జనన ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఉదయం 9 ఎంపికలకు క్రీడాప్రాంగణం వద్దకు చేరుకోవాలని జిల్లా కబడ్డీ సంఘం ఛైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధ్యక్షుడు నక్క కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు పేర్కొన్నారు. సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు వద్ద రిపోర్ట్ చేయాలని కోరారు. పూర్తి వివరాలకు 94419 14214 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
జూనియర్స్ ఇలా..
జూనియర్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనే బాలబాలికల వయస్సు 20 ఏళ్లలోపు ఉండాలి. బాలురు 2006 నవంబర్ 4 తర్వాత జన్మించి, 75 కేజీలులోపు బరువు కలిగి ఉండాలి. బాలికలు 2006 నవంబర్ 29 తర్వాత జన్మించి, 65 కేజీలు లోపు బరువు కలిగి ఉండాలి. ఎంపిక చేసిన జిల్లా జట్లు త్వరలో మార్కాపురం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.
సబ్‌జూనియర్స్ ఇలా..
సబ్–జూనియర్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనే బాలబాలికల వయస్సు 16 ఏళ్లలోపు ఉండాలి. బాలురు 60 కేజీల లోపు బరువు కలిగి 2010 డిసెంబర్ 12 తర్వాత జన్మించి ఉండాలి. బాలికల 55 కేజీలలోపు బరువు కలిగి, 2010 డిసెంబర్ 30వ తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను పశ్చిమగోదావరి జిల్లా నూజివీడులో జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా తరఫున పంపించనున్నారు.


