అరసవల్లి: రెండో రోజు కూడా ఆకాశంలో మబ్బులు సూర్యకిరణ దర్శనానికి అడ్డంకిగా నిలిచాయి. శుక్రవారం సూర్యోదయ సమయాన నేరుగా గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును తొలి సూర్యకిరణాలు తాకుతాయని వందలాది మంది భక్తులు ఆదిత్యాలయానికి తరలివచ్చినప్పటికీ రెండో రోజు కూడా నిరాశే మిగిలింది. మబ్బుల చాటు కారణంగా కిరణాలు మరింత ఎత్తులోకి ప్రసరించడంతో గర్భాలయంలోనికి కిరణాలు ప్రసరించలేదు. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సునీత తదితరులు ఆదిత్యుని ఆలయంలో అద్భుతాన్ని తిలకించేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ సంప్రదాయం ప్రకారం అంతరాలయ దర్శనంతో పాటు వేదాశీర్వచనాన్ని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ బృందం అందజేయగా, ఆలయ ఈఓ కేఎన్‌విడివి ప్రసాద్ ఆదిత్యుని జ్ఞాపికను అందజేశారు. మళ్లీ వచ్చే ఏడాది మార్చి 9,10 తేదీల్లోనే కిరణ స్పర్శ దర్శన సమయాలని ఆలయ ప్రధానార్చకులు శంకరశర్మ ప్రకటించారు.


