శ్రీకాకుళం డీఎస్పీ వివేకానందకు బదిలీ | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం డీఎస్పీ వివేకానందకు బదిలీ

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

శ్రీకాకుళం డీఎస్పీ వివేకానందకు బదిలీ ● ఆయన స్థానంలో ధనుంజయ్‌నాయుడు నియామకం

శ్రీకాకుళం క్రైమ్‌ : శ్రీకాకుళం సబ్‌ డివిజనల్‌ కార్యాలయ అధికారి (డీఎస్పీ)గా రెండేళ్ల క్రితం వచ్చిన సీహెచ్‌ వివేకానంద గురువారం బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో మూడు నెలల క్రితం సీఐ నుంచి డీఎస్పీగా ప్రమోషన్‌ పొంది మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో వెయిటింగ్‌లో వున్న సీహెచ్‌ ధనుంజయనాయుడు రానున్నారు. వివేకానందను శ్రీకాకుళం విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీగా నియమిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులొచ్చాయి. ధనుంజయనాయుడు వచ్చాక రిలీవ్‌ అయ్యి మంగళగిరి డీజీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేసి విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ విధుల్లో చేరుతానని వివేకానంద పేర్కొన్నారు. రెండేళ్లగా ఎటువంటి ఒత్తిడి లేకుండా విధులు చేసేలా ఉన్నతాధికారులు సహకరించారని, సీఐలు, ఎస్‌ఐలు, దిగువస్థాయి సిబ్బంది చక్కని పనితీరు కనబర్చారని పేర్కొన్నారు.

ఇన్నాళ్లకు మోక్షం..

కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీగా వున్న కిరణ్‌ బదిలీ అయ్యారు. అప్పటినుంచి మరొకరికి పోస్టింగ్‌ దక్కలేదు. ఈ విభాగానికి ఎస్పీగా కొన్నాళ్లు బర్ల ప్రసాదరావు కొనసాగినా ఆయన రిటైర్‌ కావడంతో జిల్లాకు చెందిన మంత్రుల కుటుంబీకుడు కింజరాపు ప్రభాకర్‌ ఇన్‌చార్జి ఎస్పీగా కొనసాగుతున్నారు. ఈయన ప్రస్తుతం విశాఖపట్నం విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేకానంద డీఎస్పీగా ఇక్కడికి రానుండటం మరో వారం రోజుల్లో ఏఎస్పీగా పదోన్నతి దక్కనుందని వార్తలు వినిపిస్తుండటంతో విభాగానికి ఇన్నాళ్లకు మోక్షం లభించనున్నట్లు పలువురు భావిస్తున్నారు. వివేకానంద అటు ప్రజా సమస్యలతో పాటు కీలక కేసుల్లో తన పర్యవేక్షణతో సబ్‌డివిజన్‌ పరిధి సర్కిల్‌ అధికారులతోను, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాల అండతో నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషించారు. పోలీసు అధికారిక వ్యవహారాల్లోను, మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాల్లో కీలకంగా ఉండి ఉన్నతాధికారుల మన్నన పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement