శ్రీకాకుళం పాతబస్టాండ్: పరిపాలనలో ఏఐ వినియోగించడం ద్వారా పని సులభతరం కావడమే కాకుండా, వేగవంతమవుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో టైపిస్టులు, జూనియర్ సహాయకులు, సీనియర్ సహాయకులు, సెక్షన్ సూపరింటెండెంట్లు తదితర పరిపాలనా సిబ్బందికి ఏఐ పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కత్రిమ మేధ (ఏఐ) యాప్‌ల వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. కార్యాలయాల్లో పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగ్గా, వేగవంతంగా సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ తగిన శిక్షణ పొంది నిరంతరం ప్రాక్టిస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


