శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని చాపురం పంచాయతీ సిద్ధిపేట గ్రామానికి చెందిన ఏగాటి రామారావు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల విధి నిర్వహణలో భాగంగా గ్రామంలో చెత్త సేకరణ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన గొండు శిమ్మయ్యతో చెత్త తీస్తున్న విషయంలో గొడవ జరిగింది. దీంతో ఒకరుకొకరు కొట్టుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మూడు రోజులు క్రితం పంచాయితీ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అల్లు నర్సయ్య ఈ తగాదాలో కలుగజేసుకొని తమ పార్టీ సానుభూతిపరుడైన సిమ్మయ్య తప్పిదం ఉన్నప్పటికీ దాన్ని పక్కదారి పట్టించాడు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు రామరావుపై లేనిపోని చాడీలను మున్సిపల్ అధికారులకు చెబుతూ విధులు నుంచి తొలగిస్తామంటూ భయబ్రాంతుకు గురిచేశాడు. దీంతో మనస్థాపం చెందిన రామారావు బుధవారం సాయంత్రం ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స విభాగంలో వైద్య సేవలందుతున్నాయి. దీనిపై కేసు నమోదయ్యింది.


