● నిత్యం నిలిచిపోతున్న భూ రిజిస్ట్రేషన్లు
● అవస్థలు పడుతున్న క్రయ, విక్రయదారులు
ఆమదాలవలస రూరల్: రిజిస్ట్రేషన్ల శాఖకు గడ్డుకాలం పట్టింది. ప్రభుత్వానికి అత్యంత లాభాలు తెచ్చిపెడుతున్న శాఖలో సర్వర్లు నిత్యం మొరాయిస్తుండడంతో ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే కాకుండా.. జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచి సర్వర్ల సమస్య ఉండడంతో భూ క్రయ, విక్రయాలకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు కూడా అవ్వలేదు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనూ సర్వర్లు పనిచేయపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏమాత్రం ముందుకు సాగక క్రయ, విక్రయదారులు నానా అవస్థలు పడ్డారు. మొత్తంమీద ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ శాఖపై దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు నిత్యకృత్యమయ్యాయి. అక్రమ ఇసుక రవాణాపై పెట్టిన దృష్టి, రిజిస్ట్రేషన్లపై కూటమి ప్రభుత్వం పెట్టడం లేదని పలువురు మండిపడుతున్నారు. ప్రతిరోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే విషయం ఆన్‌లైన్‌లో చూపుతుందని, అయితే ఈ విషయం ప్రభుత్వ పెద్దల కళ్లకు కనిపించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రిజిస్ట్రేషన్ల శాఖపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతున్నారు.


