● కదిలిన డీ పట్టాదారులు | - | Sakshi
Sakshi News home page

● కదిలిన డీ పట్టాదారులు

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

వేధింపులు.. బెదిరింపులు.. మోసాలు ఫోకస్‌

● ‘ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నారు’

● న్యాయం చేయండి

● జగన్నాథ స్వామి భూములకు శఠగోపం

కవిటి: కొజ్జీరియా పంచాయతీలో వెలసిన జగన్నాథ స్వామి భూములు అన్యాక్రాంతమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్యం పేరు మార్పిడి జరిగిందని పంచాయతీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కవిటి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ వి.రవివర్మకు, తహసీల్దార్‌ టి.కల్యాణచక్రవర్తికి వేర్వేరుగా వినతిపత్రాల్ని అందించారు. కొజ్జీరియా రెవెన్యూలో 175/14 ,178/15 నుంచి వరుసగా 175/22 వరకు కలిపి మొత్తం 2.80 ఎకరాల భూమి జగన్నాథ స్వామి దేవాలయానికి ఉంది. దీనికి సంబంధించి ఎల్‌పీఎం నంబర్‌ 1956, 1682, 2048గా రెవెన్యూ శాఖ అధికారులు రీసర్వే ద్వారా మార్పిడి చేశారు. క్రయ విక్రయాలు జరిగినట్లు కూడా తమకు సమాచారం వచ్చిందని స్థానికులు తెలిపారు. సమస్య పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు సైతం సిద్ధమని తెలిపారు.

సంతబొమ్మాళి: వడ్డితాండ్ర రెవెన్యూ గ్రామంలో డీపట్టా భూములకు వారసులుగా టీడీపీ నాయకుల పేర్లను నమోదు చేయడమే కాకుండా తాకట్టు పెట్టి అక్రమంగా రుణాలు మంజూరు చేయించుకునేందుకు కారకులైన అధికారులపై కేసులు నమోదుచేయాలని వడ్డితాండ్ర డీ పట్టాదారులు కోరారు. వారంతా కలిసి సో మవారం పీజీఆర్‌ఎస్‌కు వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో డీపట్టాదారులంతా కదిలి వెళ్లారు. టెక్కలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్తావేజు నంబర్‌ 2227/2004,2382/2004, 1552/2005 ద్వారా రూ.11 లక్షలు రుణాన్ని ముగ్గురు అక్రమంగా పొందారని వివరించారు. డీ పట్టా భూములు సర్వే నంబర్‌ 179–5లో 1.50 ఎకరాలు, 180–3లో 1.95 ఎకరాలు, 178–1లో 1.55 ఎకరాలు, 178–5లో 1.25 ఎకరాలు, 178–2లో 1.35 ఎకరాలు, 179–4లో 1.40 ఎకరాలు, 179–1లో 1.10 ఎకరాలు, 183–2లో 2.50 ఎకరాలు, 178–3లో 1.42 ఎకరాలు, 178–4లో 1.40 ఎకరాలు దళితులు, బీసీలకు సంబంధించినవని, ఆ భూములకు సంబంధం లేని టీడీపీ నాయకులు అట్టాడ తిరుపతిరావు, రవణమ్మ దంపతులతో పాటు మరికొందరు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌ అధికారుల సాయంతో వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారని ఆరోపించారు. దీనిపై విచారణచేయాలన్నారు. కార్యక్రమంలో డీ పట్టాదారులు సామ భాస్కరరావు, మునకాల కామమ్మ, ఇచ్చాపు రం రమణారావు, అనపాన కూర్మనాధ్‌, రాజాపు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

మద్యం మత్తులో మహిళలపై వేధింపులు.. అధికార మదంతో భూ కబ్జాలు.. ఆస్తిని సాగు చేసుకోనివ్వకుండా బెదిరింపులు.. అప్పు తీర్చలేదని ఆక్రమణలు.. సైబర్‌ మోసానికి గురయ్యామంటూ ఆక్రందనలు.. వెరసి సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌లో సమస్యలు ఏకరవు పెట్టారు. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు బాధితుల నుంచి మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించారు. అందరితో ముఖాముఖి మాట్లాడారు. – శ్రీకాకుళం క్రైమ్‌

క్రెడిట్‌ కార్డు మోసం

క్రెడిట్‌ కార్డు మోసంపై మరో ఫిర్యాదు వచ్చింది. మూడు నెలల కిందట ఫేక్‌ వెబ్‌సైట్‌కు క్లిక్‌ చేయడంతో రూ.1.75 లక్షలు మోసానికి గురయ్యానని, ఈ విషయమై ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లోను, ఆన్‌లైన్‌ సైబర్‌పోర్టల్‌లోను, ఎస్పీ కార్యాలయానికి సైతం ఫిర్యాదులిచ్చినా నేటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఎచ్చెర్ల మండలం చిలకపాలేనికి చెందిన ఎం.శ్రావణి సోమవారం మరో మారు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

తాగి రెచ్చిపోతున్నారు

పట్ట పగలు కొందరు తమ ఆస్తిలోకి ప్రవేశించి మద్యం సేవిస్తున్నారని, అడిగితే మరింత రెచ్చిపోతున్నారని గార మండలం రామచంద్రాపురానికి చెందిన వృద్ధురాలు నీలాపు లీలావతి ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సిమ్మపేట శ్రీనగర్‌ కాలనీకి చెందిన జి.అనిల్‌ మరికొందరు తమ ఆస్తిలోకి ప్రవేశించి మద్యం సేవించి న్యూసెన్సు చేస్తుండటంతో కోడలు సుమిత్రతో కలసి అడిగానని, దీంతో అతడు కుటుంబాన్ని గ్రామం నుంచి తరిమేస్తామని బెదిరించారని ఫిర్యాదు చేశారు. తన కొడుకులిద్దరూ దేశ సేవలో ఉన్నారని తెలిసినా తమతో ఇలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సాగు చేయనివ్వడం లేదు..

ఎచ్చెర్ల మండలం కొంగరాం రెవెన్యూ పరిధిలో వారసత్వంగా వచ్చి, నాలుగేళ్ల నుంచి సాగులో ఉన్న భూమిని నక్క సూర్యనారాయణ, నక్క తవిటమ్మ, రావాడ లక్ష్మి మరో నలుగురు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని కొంగరాంకు చెందిన నక్క లక్ష్మీనారాయణ ఎస్పీ గ్రీవె న్సులో ఫిర్యాదు చేశారు. మాపైకి కర్రలతో, కత్తులతో, కొడవళ్లతో వచ్చి సాగు చేయనివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కబ్జా కాండ

తప్పుడు సర్వే నంబర్‌తో తనకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇప్పించడమే కాక తమ సాగులో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన బరాటం లక్ష్మణరావు ఎస్పీ గ్రీవెన్స్‌ లో ఫిర్యాదు చేశారు. 22 ఏళ్ల కిందట పొన్నాడ సత్యనారాయణ, దుర్గాప్రసాద్‌ వెంకటరమణ, కృష్ణమూర్తి తప్పుడు సర్వే నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేయించారని, దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తుంటే సహకరించకపోగా.. మళ్లీ డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో చిలకపాలెంకు చెందిన మిర్తిపాటి వసంతరావు, వారి బావ అటకేశ్వరరావు తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించి తమను చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. వీరిపై ఫోర్జరీ, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు.

స్థలం ఆక్రమణ

పలాస రంగోయికి చెందిన ఓ మహిళ 30 సెంట్ల స్థలాన్ని రూ.30 లక్షలకు ఓ రియల్టర్‌కు విక్రయించారు. కానీ ఆయన ఆ స్థలం మొత్తాన్ని దాదాపు రెండెకరాలు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నార ని ఆమె గ్రీవెన్స్‌ను ఆశ్రయించారు. రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నామని, అప్పు ఇచ్చిన వ్యక్తితో కలిసి రియల్టర్‌ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.

గ్రీవెన్స్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో 86 ఫిర్యాదులు నమోదయ్యాయి. అందిన వినతులలో అత్యధికంగా రెవెన్యూ (సీసీఎల్‌ఏ) శాఖకు సంబంధించి 34 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలో 10, సర్వే సెటిల్‌మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలో 8, సెర్ప్‌ విభాగంలో 8 వినతులు నమోదయ్యాయి. అలాగే స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కింద 7, విద్యుత్‌ శాఖ పరిధిలో 3 అర్జీలు వచ్చాయి. జలవనరుల శాఖ, హౌసింగ్‌ కార్పొరేషన్‌, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్‌, పోలీసు శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెరో 2 చొప్పున ఫిర్యాదులు అందాయి. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుతూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సైకిల్‌ తొక్కుకుంటూ కార్యక్రమానికి వచ్చారు. అంతకుముందు ఆయన సైకిల్‌పైనే ఎచ్చర్ల వీధిలోని ప్రభుత్వ మున్సిపల్‌ పాఠశాలకు వెళ్లి నులి పురుగుల మాత్రలు పంపిణీ చేశారు.

● శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అరసవల్లి రోడ్డులో కాలువను ఆక్రమించి భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆ గ్రామానికి చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారు.

● రాష్ట్రంలో దళితులపై మారణకాండ జరుగుతోందని బీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ వద్ద నిరసన తెలిపారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

● కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన సీనియర్‌ సిటిజన్ల రైల్వే చార్జీల రాయితీని తక్షణమే పునరుద్ధరించాలని శ్రీకాకుళం సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ సంఘం నాయకులు కలెక్టర్‌ను కోరారు. వయోధికుల కోసం సీనియర్‌ సిటిజన్స్‌ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని విన్నవించారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జలుమూరు మండలం గొటివాడ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కోరా రు. గొటివాడ గ్రామంలో గ్రామకంఠ మైన సర్వే నంబర్‌ 69–3లో సుమారు 30 సెంట్ల భూమిలో గత ప్రభుత్వ హయాంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం భవనాల నిర్మాణానికి పునాదులు, పిల్లర్లు వేసి పనులు ప్రారంభించారని, ప్రభుత్వం ఆ పనులకు గాను రూ.11 లక్ష ల నిధులు విడుదల చేసిందని ఆయన తెలిపారు. కానీ కొందరు కూటమి నాయకులు నిర్మాణంలోని భవనాలను మట్టితో కప్పి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు చూస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నవిరి పోతయ్య, మాజీ ఎంపీటీసీ సోమినేని కృష్ణ, మొయ్యి సింహాచలం, బాన్న శ్రీనివాస్‌ దామ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు వచ్చిన

వినతుల సంఖ్య

86

ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చిన వినతుల సంఖ్య

72

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement