మభ్యపెట్టి టీడీపీ కండువాలు కప్పారు | - | Sakshi
Sakshi News home page

మభ్యపెట్టి టీడీపీ కండువాలు కప్పారు

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

● మేమంతా వైఎస్సార్‌ సీపీ పక్షానే ఉన్నాం

● స్పష్టం చేసిన సీతాపురం పంచాయతీ ప్రజలు

టెక్కలి: ఉపాధి పనులకు సంబంధించిన పని ఉందంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నమ్మబలికి మమ్మల్ని మంత్రి అచ్చెన్నాయుడు దగ్గరకు తీసుకువెళ్లి మభ్యపెట్టి మరీ టీడీపీ కండువాలు వేయించారని టెక్కలి మండలం సీతాపురం గ్రామస్తులు స్పష్టం చేశారు. సీతాపురం, తిర్లంగి నుంచి సుమారు 500 కుటుంబాలు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరినట్లు ప్రచారం జరగడంతో.. సోమవారం ఆయా గ్రామాల ప్రజలంతా టెక్కలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్‌తో మాట్లాడారు. అసలు తమ గ్రామంలో 500 కుటుంబాలే లేకుండా టీడీపీ నాయకులు ఎలా ప్రకటనలు చేస్తారని తప్పుపట్టారు. తామంతా ఎప్పటికీ వైఎస్సార్‌సీపీ పక్షానే ఉంటామని వెల్లడించారు.

ఓటమి భయంతోనే..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మంత్రి అచ్చెన్నాయుడు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని పేరాడ తిలక్‌ మండిపడ్డారు. ఆయన సీతాపురం పంచాయతీ ప్రజలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీతాపురం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్‌ మొట్టమొదటి చైర్మన్‌ బెండి కూర్మన్న, అదే ప్రాంతంలో సంపతిరావు రాఘవరావు, దువ్వాడ వాణి, చింతాడ మంజు ఎంతో మంది కీలకమైన పదవులు చేపట్టారని తిలక్‌ గుర్తు చేశారు. మొదట కాంగ్రెస్‌, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న సీతాపురం రాజకీయ చరిత్రను భ్రష్టుపట్టించే విధంగా మంత్రి అచ్చెన్నాయుడు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పంచాయతీలో టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థి లేకపోవడంతో ఇలా ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో సుమారు 187 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేసినప్పటికీ ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త బెదరకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారని గుర్తు చేశారు.

సమావేశంలో మాజీ జెడ్పీటీసీ దువ్వాడ వాణి, మాజీ ఎంపీటీసీ బెండి దేవయాని, బెండి ఉదయ్‌, బెండి గిరి, కర్నిక జీవన్‌, బెండి శ్రీను, పి.సోమేష్‌, కె.రాంబాబు, వై.కోదండ, వై.ధనుంజయరావు, డి.ఎండువాడు, డి.రాజేష్‌, బి.భుజంగరావు, పాపారావు, బి.బలుసాకు, బి.రాజేష్‌, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సత్తారు సత్యం, టెక్కలి టౌన్‌ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్‌, నాయకులు కె.అజయ్‌, జి.మోహన్‌రెడ్డి, బి.కార్తీక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement