కాశీబుగ్గ: కూటమి నేతలు సచివాలయ ఉద్యోగుల వెనుక పడుతున్నారు. మెరుపు సమ్మెతో నాయకులకు షాకిచ్చిన ఉద్యోగులపై బదులు తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కంచిలి, కవిటి మండలాల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యం చేసుకున్నారు. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారి జాబితాను సేకరించే పనిలో పడ్డారు. ఆదివారం విజయవాడలో జరిగిన పోరుబాటలో పలాస మండలంతోపాటు కాశీబుగ్గ పట్టణానికి చెందిన కొందరు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల నుంచి ఎవరెవరు నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు? ఆవివరాల సేకరణలో ఉన్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో కూటమి నాయకులతోపాటు ‘గ్లాస్ బాస్’లు కొందరు సచివాలయ ఉద్యోగులను లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వారిని వైఎస్సార్‌సీపీ అనుకూలురంటూ ఉద్యమానికి ఉసి గొల్పడంలో కీలక పాత్ర పోషించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలోకి వస్తే అన్నీ చెల్లిస్తామంటూ హామీఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కాలయాపన చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ తమకు రావాల్సిన ఐఆర్, పీఆర్సీ ఐదు డీఏలు మొత్తంగా రూ. 40వేల కోట్ల బకాయిలు చెల్లించాలంటూ నినదించిన ఉద్యోగుల గళం పాలకులకు గరళంగా మారింది. ఎక్కడికక్కడ నిరంకుశంగా వ్యవహరించిన ప్రభుత్వం ఉద్యోగులపై ఉక్కుపాదం మోపాలని చూసింది. అయినా ఉద్యోగుల ఐక్యత ముందు అవన్నీ తేలిపోయాయి. పోలీసు ముందస్తు ఆంక్షలను సైతం లెక్కచేయలేదు. దీంతో ఇప్పుడు ఉద్యోగులపై వేధింపులకు సిద్ధమవుతున్నారు.
విజయవాడ వెళ్లిన సచివాలయ ఉద్యోగుల వివరాల సేకరణ
వేధింపులకు సిద్ధమవుతున్న కూటమి నాయకులు


