ఆడపిల్ల కట్టు బొట్టును ఎంత పద్ధతిగా చూసుకుంటుందో జుట్టును కూడా అంతే మురిపెంగా చూసుకుంటుంది. తాహతకు తగ్గట్టుగా కేశ సంరక్షణ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఓ అమ్మాయి ఒత్తుగా ఎదిగిన జట్టు ను వేదికపైనే కత్తిరించి దానం చేసింది. ఆమె పేరు జోషిత. ఆదివారం సిక్కోలు సింగర్స్ నిర్వహించిన బాలు స్వరనీరాజనం వేదికపై తన జుట్టును ఇలా కత్తిరించి కేన్సర్ పేషెంట్ల కోసం దానం చేసింది. కేన్సర్‌తో బాధపడే వారు కేశాలను కోల్పోతుంటారు. వారి కోసం కేశాలను దానం చేసే పద్ధతి మెట్రోపాలిటన్ సిటీల్లో కనిపిస్తూ ఉంటుంది. తన ఇంటిలోనే ఇద్దరు కేన్సర్‌తో బాధ పడుతూ జుట్టును కోల్పోవడం చూసిన జోషి త ఇలా కేశదానం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నగరంలోని జెడ్పీ వెనుక ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్న జోషిత తల్లిదండ్రులు పుల్లేటి కుర్తి మురళీకృష్ణ, హేమలత. వారి సహకారంతోనే ఇంటర్ చదువుతున్న జోషిత ఈ కార్యక్రమానికి పూనుకుంది.
సాధారణంగా కనీసం 10 నుంచి 12 అంగుళాల పొడవున్న జుట్టును దానం చేయవచ్చు. జుట్టు పొడిగా, శుభ్రంగా, రంగులు వేయనిదై ఉండాలి. జుట్టును రబ్బరు బ్యాండ్‌తో గట్టిగా కట్టి, ఆ బ్యాండ్‌కి కింద లేదా పైన కత్తెరతో కట్ చేయాలి. 9666406586, 9390324177 నంబర్లను సంప్రదించవచ్చు. – శ్రీకాకుళం కల్చరల్


