నాన్నా వద్దంటున్నా వినకుండా.. | - | Sakshi
Sakshi News home page

నాన్నా వద్దంటున్నా వినకుండా..

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

● ఈత వచ్చు దూకుతానంటూ నాగావళిలో దూకిన వ్యక్తి

● కూతురి కళ్లెదుటే ఘటన

● ఇప్పటివరకు జాడ తెలియని వైనం

శ్రీకాకుళం క్రైమ్‌ : పదమూడేళ్ల కుమార్తె.. వినా యక నిమజ్జనంలో తండ్రి చిందులేస్తుంటే ముచ్చటపడింది. హుషారుగా సందడి చేస్తుంటే ఆనంద పడింది. కానీ మద్యం మత్తులో తండ్రి చేసిన పని ఆ కుమార్తెను నిశ్చేష్టురాలిని చేసింది. ‘నాకు ఈత వచ్చు.. నదిలో దూకుతా’ అన్న తండ్రిని ‘నాన్నా వద్దు నాన్నా..’ అని ఎంతో బతిమలాడింది. కానీ ఉత్సవ ఉత్సాహం, మద్యం మత్తు ఆ వ్యక్తిని ఊరుకోనీయలేదు. మొబైల్‌, షర్టు తీసి కుమార్తెకు ఇచ్చి అమాంతం నదిలో దూకేశాడు. అంతే ఆ ప్రవాహంలో ఇక అతను కనిపించనే లేదు. జిల్లాకేంద్రంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకె త్తించింది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు..

పెద్దరెల్లివీధిలో నివసిస్తున్న షణ్ముఖ శ్రీను(36), భార్య అనితతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి 13 ఏళ్ల జాహ్నవి, 11 ఏళ్ల మోహన్‌ సంతానం ఉన్నారు. పెద్దరెల్లివీధిలో శనివారం రాత్రి 8 గంటలకు వినాయక నిమజ్జన ఊరేగింపు ప్రారంభమైంది. డీజేలు, డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ క్ర మంలో షణ్ముఖశ్రీను కుమార్తెను నడిపించుకుంటూ తనవెంటే తీసుకెళ్లాడు. అప్పటికే అతను మద్యం సేవించి ఉన్నాడు. వంతెన సమీపానికి వచ్చేసరికి సరిగ్గా 12 గంటలకు కుమార్తెతో తనకు ఈతవచ్చని, నదిలో దూకి ఒడ్డుకు చేరుకుంటానని చెప్పి మొబైల్‌ఫోన్‌, షర్టు తీసి ఇచ్చాడు. జాహ్నవి వద్దని వారించినా వినలేదు. తన తండ్రి దూకేందుకు ప్రయత్నిస్తున్నాడని నిర్వాహకులకు చెప్పేలోగానే షణ్ముఖ శ్రీను దూకేశాడు. ఆ ప్రవాహానికి దూకిన వ్యక్తి ఆనవాలైనా కనిపించలేదు. దీనిపై అదృశ్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఈశ్వరరావు చెప్పారు. నిమజ్జనాలు రాత్రి 10 నుంచి 11గంటల్లోగా ముగించాలని పోలీ సులు ఆంక్షలు పెట్టినా అర్ధరాత్రి వరకు ఉత్సవాలు కొనసాగించారు. చిన్న పిల్లలను నిమజ్జన ప్రదేశాలకు తీసుకెళ్లకూడదన్నా పెడచెవిన పెట్టారు. ఊరేగింపుల్లో మద్యం మత్తులో డ్యాన్స్‌లు వేయకూడదని తెలిసినా పట్టించుకోలేదని విమర్శలు వినిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement