నందిగాం: సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక పరిణయ క్రతువులూ వినూత్నంగా జరుగుతున్నాయి. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న జంట వీసా సమస్యతో స్వదేశానికి రాలేకపోవడం, అలాగే అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులు వీసా సమస్యతో అమెరికా వెళ్లలేకపోవడంతో ఆ జంట అక్కడ వివాహం చేసుకోగా తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో వివాహం చూసి ఆశీర్వదించిన ఘటన నందిగాం మండలం పోలవరం గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. నందిగాం మండలం బెజ్జిపల్లి పంచాయతీ పోలవరానికి చెందిన కూను జోసెఫ్, సుజాతల కుమారుడు మనష్సె అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ హైకోర్టులో పనిచేస్తున్న పాల్‌ప్రకాష్, సునీతల కుమార్తె హెప్సిబాతో యువకుడికి వివాహం నిశ్చయమైంది. హెప్సిబా కూడా అమెరికాలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అయితే వివాహ సమయానికి వీరికి వీసా సమస్య వచ్చి పడింది. స్వదేశానికి రాలేకపోయారు. వధూవరుల తల్లిదండ్రులు కూడా వీసా సమస్య వల్ల అక్కడకు వెళ్లలేకపోయారు. దీంతో వివాహం అమెరికాలోనే చేసుకోవాలని నిశ్చయించారు. అమెరికాలోని కెంటకీ స్టేట్ ల్యూయిస్‌విల్లే గ్రామంలో బెథనీ చర్చిలో శనివారం రాత్రి 8 గంటలకు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. వరుడి తండ్రి జోసెఫ్ ఇంటిలోనూ బంధువర్గమంతా ఆన్‌లైన్‌లో వివాహాన్ని వీక్షించారు. భావోద్వేగానికి గురై ఆన్‌లైన్‌లోనే వారికి దీవెనలు అందజేసి సంతోషపడ్డారు.


