పాత బియ్యం
పీడీఎస్ బియ్యంతోనే పాపాలు
● జిల్లాలో భారీగా సీఎంఆర్ అవినీతి
● చీపురుపల్లి గోడౌన్‌లో బయటపడిన పీడీఎస్ బియ్యం
● ఈ బియ్యమంతా మన జిల్లా మిల్లర్లవే
● ప్రజలకు పాత పీడీఎస్ బియ్యమే తిరిగి ఇస్తున్న వైనం
బియ్యమంతా పచ్చ పార్టీ మిల్లర్లవే..
పెందుర్తి గోడౌన్‌కు సీఎంఆర్ ముసుగులో పంపించిన పీడీఎస్ రైస్ పుణ్యం అంతా టీడీపీ నేతలకు చెందిన మిల్లులవే. తాజాగా చీపురుపల్లి గోడౌన్‌కు కూడా కోటబొమ్మాళి, నరసన్నపేట మండలానికి చెందిన మిల్లర్ల నుంచే సీఎంఆర్ ముసుగులో పీడీఎస్ రైస్ వెళ్లింది. జిల్లాలోని కీలక నేత సోదరుడి అండతో రెచ్చిపోయి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారు. డిపోల ద్వారా ఇచ్చే రేషన్ బియ్యాన్ని సేకరించి, అదే బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి తిరిగి కట్ట బెడుతున్నారు. సీఎంఆర్ ముసుగులో భారీ అవినీతికి పాల్పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి.. ఆ ధాన్యాన్ని మిల్లులకు పంపించి ఆడించాలి.. అక్కడ ఆడించాక వచ్చిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను ఎఫ్‌సీఐ, స్టేట్ వేర్ హౌసింగ్, సివిల్ సప్లయిస్, ప్రైవేటు గోడౌన్లకు పంపించాలి. అనంతరం ఆ ధాన్యాన్ని జనాలకు లబ్ధి కింద జిల్లాలకు అందించాలి. ఇదీ పద్ధతి. కానీ ఈ ప్రక్రియలో లోపాలను అదనుగా మార్చుకుని ‘కొందరు’ కోట్లు గడిస్తున్నారు. ప్రజలకు కస్టమ్ మిల్లింగ్ రైస్ కాకుండా పాత పీడీఎస్(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం) బియ్యమే ఇస్తున్నట్లు అనేక దాఖలాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో పెందుర్తి గోడౌన్‌లో ఈ తరహా అక్రమాలు వెలుగు చూడగా తాజాగా చీపురుపల్లి మండలం పత్తికాయవలస ఫుడ్ పార్క్‌లోని వేర్ హౌసింగ్ గోడౌన్ నుంచి వచ్చిన సీఎంఆర్‌లో కూడా పీడీఎస్ రైస్‌ను గుర్తించినట్టు సమాచారం.
ఆగని అవినీతి దందా..
గోడౌన్లలో స్టాక్ చేసిన సీఎంఆర్‌ను ప్రభుత్వం పలు అవసరాల కోసం జిల్లాలకు కేటాయిస్తుంది. అయితే జిల్లాల్లో గోడౌన్ల సామర్థ్యం లేక ఈ ఏడాది మే నెలలో పెందుర్తి గోడౌన్‌లో ఇక్కడి సీఎంఆర్‌ను స్టాక్ చేశారు. దాదాపు 56 మిల్లుల నుంచి వేలాది మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌లో పీడీఎస్ రైస్ ఉన్నట్టు గుర్తించారు. దీనిపై నోటీసులు జారీ చేసి విచారణ కూడా జరిపారు. హెడ్ ఆఫీస్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సివిల్ సప్లయ్ డీఎం స్థాయి అధికారులు తనిఖీ చేశారు. కానీ ఆ విచారణ ఏమైందో, చర్యలేంటో? ఇప్పటివరకు తెలియదు. ఆ బాగోతం తేలనే లేదు.. ఇప్పుడు జూన్‌లో చీపురుపల్లి మండలం పత్తికాయవలస స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్‌కు మిల్లర్లు పంపించిన సీఎంఆర్‌లో కూడా పీడీఎస్ రైస్ ఉన్నట్టు తేలింది. చీపురుపల్లి గోడౌన్‌లో ఉన్న బియ్యాన్ని విశాఖ జిల్లా అవసరాలకు కేటాయించడంతో.. ఇక్కడి నుంచి అక్కడకు రవాణా చేశారు. పలు ఎంఎమ్‌ఎల్ పాయింట్‌ల వద్ద విశాఖపట్నం జిల్లా సివిల్ సప్లయి అధికారులు తనిఖీ చేసిన సందర్భంలో పీడీఎస్ గుట్టు రట్టయ్యింది. పత్తికాయవలస గోడౌన్‌కు శ్రీకాకుళం జిల్లాలోని 32మిల్లుల నుంచి వేలాది మెట్రిక్ టన్నుల సీఎంఆర్ వెళ్లింది. దాంట్లో దాదాపు పీడీఎస్ రైస్ ఉన్నట్టు సమాచారం. దీనిపై విశాఖ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హెడ్ ఆఫీస్ ఎప్పటిలాగే ఒక బృందాన్ని పంపించి, విచారణ జరిపించింది. దానికి సంబంధించిన నివేదిక హెడ్ ఆఫీస్‌కు చేరినట్టు తెలిసింది.
రూ.కోట్లలో అడ్డగోలు సంపాదన
ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని ఆడించి బియ్యంగా ఇచ్చేందుకు మిల్లులకు ప్రత్యేకంగా చార్జీలు ఇస్తోంది. దాంతో పాటు బియ్యంలో మలినాలను, లోప భూయిష్ట ధాన్యాలు, రాళ్లు తొలగించి, ఏకరీతి రూపాన్ని తీసుకొచ్చేందుకు సార్టెక్స్ చార్జీలను కూడా ఇస్తోంది. వాస్తవంగా, మిల్లులకు ఇదే ఆదాయం కావాలి. కానీ, మిల్లర్లకు అది చాలడం లేదు. కోట్లలో కొట్టేద్దామని పక్కదారి పడుతున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలోనే పథక రచన చేస్తున్నారు. కొందరు కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే ధాన్యాన్ని ఆడించగా వచ్చిన బియ్యాన్ని ప్రైవేటు మార్కెట్‌కు విక్రయించి లబ్ధి పొంది, సీఎంఆర్ కింద బయట మార్కెట్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన పీడీఎస్ రైస్‌ను ముట్ట జెబుతున్నారు. మరికొందరు కొనుగోలు కేంద్రాల్లో తప్పుడు వివరాలు నమోదు చేసి, రైతుల నుంచి కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు, అవి ట్యాగ్ చేసిన మిల్లులకు చేరినట్టు రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం వచ్చినట్టుగా చూపించి, ఆ ధాన్యం (లేని ధాన్యం) ఆడించినట్టుగా, పీడీఎస్ రైస్‌ను ఇచ్చి సీఎంఆర్ ఇచ్చినట్టుగా చూపుతున్నారు. జిల్లాలో ఇదో పెద్ద కుంభకోణంగా మారింది.
నిఘా ఎక్కడ?
వాస్తవానికై తే, మిల్లుల నుంచి గోడౌన్లకు రవాణా చేసే లారీలకు జియో ట్యాగింగ్ ఉండాలి.
వాటిని నిరంతరం ట్రాక్ చేయాలి.
గోడౌన్‌కు చేరిన తర్వాత వివిధ అవసరాల కోసం కేటాయించినప్పుడు జిల్లాకు చెందిన సంబంధిత అధికారి తనిఖీ చేసి పాస్ ఆర్డర్ ఇవ్వాలి.
ఇదంతా నామ్ కే వాస్తేగా జరగడంతో మిల్లర్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
ప్రజలకు మళ్లీ పాత పీడీఎస్ రైస్‌నే కొత్త సీఎంఆర్‌గా చేతుల్లో పెడుతున్నారు.


