కష్టబడితే ఫలితమిలా.. | - | Sakshi
Sakshi News home page

కష్టబడితే ఫలితమిలా..

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

ఉపాధి పనుల వద్దకు వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించిన టీచర్‌

30 మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన గురువు

జి.సిగడాం: ‘ఒక సంవత్సరం మన పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి. మేము విద్య నేర్పించకపోతే మీ పిల్లలు ఇక మీ ఇష్టం’.. ఇదేదో నోటి మాట కాదు. ఏకంగా బాండ్‌ పేపర్‌పై సంతకం చేసి ఓ ఉపాధ్యాయుడు ఇచ్చిన హామీ. ఆ టీచర్‌ ఇచ్చిన హామీతో ఊరిలో పిల్లలంతా ప్రభుత్వ బడి వైపు మళ్లారు. బడిలో పిల్లల సంఖ్య 67కు పెరిగింది. మండలంలోని మధుపాం ఎంపీయూపీ పాఠశాలలో 2025 సంవత్సరంలో 1వ తరగతి నుంచి 8 వ తరగతి వరకు 36 మంది విద్యార్థులు ఉండేవారు. వీరికి ముగ్గురు టీచర్లను ప్రభుత్వం నియమించింది. కానీ బడిలో పిల్లల సంఖ్య తగ్గడంతో ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గే ప్రమాదం ఏర్పడింది. దీంతో అక్కడి టీచర్‌ టేకి రామకృష్ణ ప్రైవేటు బడులకు వెళ్తున్న పిల్లలను తమ స్కూల్‌లో చేర్పించాలని తలిచా రు. ఏకంగా పిల్లల తల్లిదండ్రులు పనిచేస్తున్న ఉపాధి హామీ స్థలాల వద్దకు వెళ్లి వారిని ఒప్పించారు. పిల్లలను బాగు చేసి తీరుతాం.. అని బాండ్‌ పేపర్‌పై సంతకాలు చేసి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దీంతో పిల్లలంతా ఈ బడిలో చేర్చడంతో హాజరు సంఖ్య 67కు పెరిగింది.

కష్టానికి ఫలితం

ఇక్కడి విద్యార్థులు 30 మంది ఆటోలపై పొందూరులోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయేవారు. వారిని మా బడిలో చేర్పించడానికి వేసవి సెలవులను వినియోగించుకున్నాం. మా హెచ్‌ఎం అరవింద కుమారి సహకారంతో మేము పడిన కష్టాన్ని గ్రామస్తులు గుర్తించారు. పిల్లలను మా బడిలో చేర్పించారు.

– టేకి రామకృష్ణ, ఉపాధ్యాయుడు, మధుపాం

ఆనందంగా ఉంది

పాఠశాలలో విద్యార్థులను చే ర్పించడానికి మేము ముగ్గురు టీచర్లం ఎంతో కష్టపడ్డాం. ఆ ఫలితంగానే పాఠశాలలో 67 మంది పిల్లలు ఉన్నారు. ఆనందంగా ఉంది.

– దున్న శ్రీదేవి, ఉపాధ్యాయురాలు, మధుపాం

బడిని నిలబెట్టాలని కోరిక

ఈ ఏడాది పిల్లలు లేకపోతే ఉపాధ్యాయులూ ఉండరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టేకి రామకృష్ణ కృషితో 30 మంది కొత్తగా చేరారు. విద్యా బోధన కోసం వలంటీర్‌ను కూడా నియమించుకున్నాం.

– పతివాడ అరవింద కుమారి, ప్రధానోపాధ్యాయురాలు, మధుపాం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement