● యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు
● ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
జలుమూరు: పొలాల్లో ఖరీఫ్ సందడి మొదలైంది. రైతులు తమ పొలాలు దుక్కులు దున్నడంతోపాటు వెద వేసేందుకు అనువుగా మార్చుకుంటున్నారు. మన జిల్లాకు సంబంధించి వరి సాగు 4.20 లక్షలు ఎకరాలు కాగా ఇందులో వెద పద్ధతిలో 78 శాతం సుమారు 3.10 లక్షలు ఎకరాలు నాట్లు, ఉడుపు పద్ధతిలో మరో 1.10 లక్షలు ఎకరాలలో సాగు చేస్తుంటారు. వెద పద్ధతిలో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. దీంతో ఈ పద్ధతిపై అధిక శాతం మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. వాతావరణం ప్రతికూలంగా మారినా.. తక్కువ నీటితో గట్టెక్కిపోవచ్చు.
ప్రయోజనాలివే..
● తొలకరి వర్షాలు సద్వినియోగం చేసుకోవచ్చు.
● నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు సుమారు ఎకరాకు ఎనిమిది నుంచి పది వేలు మిగులుతోంది.
● చెరువులు, కాలువల కింద సాగు చేసే వారు నాట్లు ఆలస్యం కాకుండా సకాలంలో వేసుకోవచ్చు.
● విత్తన మోతాదు 40–50 శాతం తగ్గించుకోవచ్చు.
● పంట నేలకు పడిపోకుండా పది నుంచి 15 రోజులు ముందు కోత కోసుకోచ్చు.
● తెగులు, పురుగుల బెడద తగ్గించుకోవచ్చు.
● కోత యంత్రాలతో సులువుగా పంట కోత కోసుకోవచ్చు.
ఈ విత్తనాలు మేలు
● లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రాంతాలకు ఎంటీయూ(1061)ఇంద్ర,ఎంటీయూ (1064)అమర, ఆర్‌జిఎల్ (2537) శ్రీకాకుళం సన్నాలు బాగుంటాయి.
● సాధారణ కాలువ ప్రాంతాలు, చెరువుల కింద ఉండే పొలాలకు ఎంటీయూ 1121(శ్రీధృతి), ఎంటీయూ 3291(సోనామసూరి) బీపీటీ 5204(సాంబమసూరి) ఎంటీయూ 1210 (సుజాత) ఎంటీయూ 1262(మార్టేర్ సాంబ) ఎంటీయూ 7029(స్వర్ణ) మేలుగా ఉంటాయి.
● కాలువ శివారు భూములకు ఎంటీయూ 1156(తరంగణి), ఎంటీయూ 1153(చంద్ర), ఎన్‌ఎల్‌ఆర్ 34449 మంచివి.
నేల తయారీ
వర్షాలు పడిన వెంటనే నేలను పలుమార్లు దున్ని మెత్తగా తయారు చేసిన తర్వాత కలుపు సమస్య కొంత వరకూ అధిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారసు మేరకు భాస్వరం, పొటాష్ తదితర ఎరు వులు వేసి నేలను కలియదున్నాలి. నేలలో తేమ సరిగా లేకపోతే మొలక రాదు. తేమను చూసుకుని రోటావేటర్‌తో విత్తనాలు వేసుకోవడం మంచిది. కాలిబాటలు వల్ల పైరుకు వెలుతురు, గాలి తగలడం, ఎరువులు సులువుగా వేసుకోవడం, చీడపీడ ల నివారణ తదితర ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే విత్తనాలు పుట్టిన తర్వాత మొక్కలు లేనిచోట కొత్త మొక్కలు వేసుకోవాలి.
అధిక దిగుబడులకు సూచనలు
● పంట పడిపోని, త్వరితగతిని కలుపు నివారణకు గల రకాలు ఎంచుకోవాలి.
● సరైన సమయంలో తగిన మోతాదులో కలుపు మందు పిచికారీ చేయాలి.
● కలుపు మందు పిచికారీ చేసే సమయంలో పొలంలో నీరు పలుచగా ఉండేటట్లు చూసుకోవడంతో పాటు తర్వాత కూడా రెండు రోజులు వరకూ నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి.
● ఎరువులు విత్తిన 15 రోజులకు పిలక దశలో మళ్లీ చిరు పొట్టదశలో వేయాలి.
● పొటాష్ ఎరువును విధిగా చిరుపొట్ట దశలో నత్రజనితోపాటు వేయాలి.
● చేనును కోత కోసే వారం రోజులు ముందు మాత్రమే ఎండగట్టాలి.


