నది రోదించేలా.. | - | Sakshi
Sakshi News home page

నది రోదించేలా..

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

నరసన్నపేట: మండల పరిధిలోని వంశధార నదిలో అక్రమార్కుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతం ఆనవాళ్లు లేకుండా చేస్తున్నా రు. అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ చోద్యం చూస్తుండటంతో అక్రమార్కులు మరింతగా రెచ్చి పోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన రెండేళ్ల నుంచీ ఇసుక అక్రమార్కులు మరింత పెరిగారు. వీరికి స్థానిక కూటమి నాయకుల అండదండలు ఉండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. మండలంలో గోపాలపెంట, మడపాం, బుచ్చిపేట, చేనులవలస వద్ద నదిలోకి రహదారులు ఏర్పాటు చేశారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు వందల లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. పరిమితికి మించి ఇసుకను లోడ్‌ చేస్తుండటంతో రోడ్లు శిథిలమవుతున్నాయి. మడపాం వద్ద మూడు వంతెనలు ఉన్న చోట కూడా ఇసుక తవ్వకాల అక్రమ వ్యవహారం నిబంధనలకు విరుద్ధంగా సాగుతూనే ఉంది. దీంతో వంశధార నది స్వరూపం మారిపోతోంది. నదిలో ఎక్కడికక్కడ చెరువుల మాదిరిగా గోతు లు కనిపిస్తున్నాయి. నదిలో నీటి ప్రవాహ దిశను తమకు అనుకూలంగా మార్చి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అంతా అనధికారికంగా జరుగుతున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం ప్రకృతి వనరులను కాపాడాల్సిన పొల్యూషన్‌ బోర్డు అధికారులు, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో వందల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అక్రమంగా తరలుతోంది. నది ఒడ్డున వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను డంప్‌ చేస్తున్నారు. ఈ ఇసుక కుప్పలు కొండలను తలపిస్తున్నాయి.

రోడ్డుపై ఇసుక మేటలు

ఇసుక అక్రమ రవాణాతో మండల పరిధిలోని చేనులవలస, బుచ్చిపేట ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఇసుక మేటలు ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. వాహనాలు స్లిప్‌ అవుతున్నాయి. ఆటోలు అదుపు తప్పుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చేనులవలస, బుచ్చిపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక మేటలతో ధూళి రేగుతోందని, ఏదైనా వాహనం వెళ్తే వెనుక ఉండలేక పోతున్నామని, ప్రయాణం చేయలేకపోతున్నా మని వాపోతున్నారు. అలాగే ఇసుక తరలింపుతో గోపాలపెంట, పోతయ్యవలస రోడ్డు కూడా అధ్వానంగా మారింది. మడపాంలో కూడా ఇదే పరిస్థితి. అధికారులు చర్యలు తీసుకోవాలని ఇసుక అక్రమ తవ్వకాలు నిలుపుదల చేయాలని కోరుతున్నారు. కాగా మండలంలో ఇసుక అక్రమ ర్యాంపులు అన్నింటినీ ఒకరే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇసుక ద్వారా ఆ పెద్దాయనకు రోజుకు కనీసం రెండు లక్షల ఆదాయం వస్తున్నట్లు సమాచారం.

వంశధార నదిలో అక్రమార్కుల విధ్వంసం

పట్టించుకోని అధికార గణం

నరసన్నపేట మండలంలో యథేచ్చగా ఇసుక దోపిడీ

Advertisement
 
Advertisement
Advertisement