వినూత్న ఆలోచన.. విశిష్ట గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

వినూత్న ఆలోచన.. విశిష్ట గుర్తింపు

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

బొంతలకోడూరు విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు

ఎచ్చెర్ల: ఉత్సవాలు, జాతరల సమయాల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంది. ఈ అంశంపై అమెజాన్‌ ఫండింగ్‌ క్వెస్ట్‌ అలయన్స్‌ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 24 పాఠశాలలు పాల్గొన్నాయి. విశాఖపట్నంలోని గీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఐదురోజులు పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు శిక్షణ కూడా పొందారు. దేవాలయ జాతరలు, ఉత్సవాలు, పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు ఒకే చోట చేరటం ద్వారా కొన్ని సార్లు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు తక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి బొంతలకోడూరు విద్యార్థులు స్మార్ట్‌ గేట్‌ ఏ 1, ఎర్లీ డిటెక్షన్‌–ఇన్‌స్టెంట్‌ ప్రొటెక్షన్‌ వ్యవస్థను ఆవిష్కరించారు. కెమెరాలు, సెన్సార్ల సాయంతో జనసమూహాన్ని పర్యవేక్షించి రద్దీ ఎక్కువైతే అలర్ట్‌ ఇచ్చి గేట్లను మొబైల్‌ యాప్‌ ద్వారా నియంత్రించి తొక్కిసలాటను నివారణ చేసే విధంగా ఒక డివైస్‌ను రూపొందించారు. వీరి ప్రాజె క్ట్‌ స్టేట్‌ లెవెల్‌లో బెస్ట్‌ ఇన్నొవేషన్‌ ప్రాజెక్ట్‌గా నిలిచింది. కార్యక్రమంలో ఆర్జేడీ విజయ్‌బాస్కర్‌, విశాఖపట్నం సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జోగా చంద్రశేఖర్‌ పాల్గొని విద్యార్థులను ప్రశంసించారు. ప్రాజెక్టును డిజైన్‌ చేసిన విద్యార్థులు అఖిల్‌పట్నాయిక్‌, డిల్లీశ్వరి, కావ్య, చైతన్య, కుమారి, రోహిత్‌లను, వీరికి మార్గ దర్శకులుగా ఉన్న సైన్స్‌ ఉపాధ్యాయిని పూర్ణిమలను రాష్ట్ర స్కెర్ట్‌ ప్రొఫెసర్‌ నాగమణితో పాటు క్వెస్ట్‌ అలియన్స్‌ బృందంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, మాజీ సర్పంచ్‌ పంచిరెడ్డి రాంబాబు, విద్యాకమిటీ చైర్మన్‌ మాడుగల సత్యానందం, చిన్నబాబు తదితరులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement