సంతబొమ్మాళి: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణం. నిబంధనలకు అనుగుణంగా ప్ర తి మూడేళ్లకు ఒక సారి బదిలీలు జరుగుతుంటాయి. అయితే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా సంతబొమ్మాళిలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిబంధలేవీ వర్తించవు. ఏళ్ల తరబడి ఉపాధి హామీ పథకంలో పాతుకుపోయి ఇష్టానుసారంగా వ్యవహరించి ఆడిందే ఆట.. పాడిందే పాటగా కొనసాగుతున్నా రు. ఉన్నతాధికారులు ఎందరు మారినా మేనేజ్ చేసుకుని తమ స్థానాన్ని పదిలం చేసుకోవడంలో వీరు దిట్ట.
రెండేళ్ల కిందట స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజావేదికలో అప్పటి డ్వామా పీడీ సుధాకర్ ఏళ్ల తరబడి ఒకే చోట పని చేసిన ఉపాధి హామీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసి బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత పీడీ సుధాకర్ బదిలీ అయి వెళ్లిపోవడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. మురపాకల మురళి 2013 జనవరిలో సంతబొమ్మాళి ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్‌గా జూయిన్ అయ్యారు. ఉప్పా డ ధర్మారావు 2013 మే నెలలో టెక్నికల్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. వీరిద్దరూ 13 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నా ఇప్పటివరకు బదిలీలు జరగలేదు. 2019 సంవత్సరంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా టి.రాజారావు, కంప్యూటర్ ఆపరేటర్‌గా గంగి జయకృష్ణరావు, జె.బాబూరావు, బి.జగదాంబ చేరారు. ఏడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు. 2021 సంవత్సరం నుంచి జి.మురళీకృష్ణ, 2022 సంవత్సరం నుంచి బి.మన్మధరావు, జి.లక్ష్మణరావు, ఎస్.రమేష్‌కుమార్ టెక్నికల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే చోట పని చేయడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
ఇన్‌చార్జిలే దిక్కు
మండలంలో సుమారు 15వేల మంది ఉపాధి వేతనదారులు పని చేస్తున్నా రెగ్యులర్ ఏపీఓ, ఈసీ పోస్టులకు నియామకాలు ఏళ్లుగా లేవు. ఇన్‌చార్జిలే దిక్కుగా మారారు. అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న పంగ నరసింహమూర్తి ఉపాధి హామీ ఏపీఓగా వ్యవహరిస్తున్నారు. అలాగే మరో టెక్నికల్ అసిస్టెంట్ జి.లక్ష్మణరావు ఇంజినీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ)గా పని చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ పో స్టులు వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీఓ జయంత్ ప్రసాద్‌ను అడుగగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు.


