ఆరోగ్య రక్షణకు ఓఆర్‌ఎస్ మండు వేసవిలో ఓఆర్‌ఎస్ ఓ సంజీవని. ప్రతి ఇంటిలో ఉండాల్సిన పానీయం. –8లో
● రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
● కన్నీరుమున్నీరైన భార్య, కుటుంబ సభ్యులు
సంతబొమ్మాళి: కాళ్ల పారా ణి ఆరలేదు.. ఇంటికి కట్టిన తోరణాలు వాడలేదు.. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి నెలయినా కాలేదు.. అప్పుడే ఆ యువకుడికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. కట్టుకున్న భార్యకు కన్నీళ్లు మిగిల్చి, కన్నవారి మదిలో శోకాన్ని రగిల్చి పెళ్లయిన 21 రోజులకే మృత్యుదేవత ఒడికి చేరుకున్నాడు. మండలంలోని మూలపేట గ్రామానికి చెందిన దారపు రాజు (27) ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈయనకు మే 10వ తేదీన వివాహమైంది. వివరాల్లోకి వెళితే..
మూలపేట గ్రామానికి చెందిన దారపు రమణరెడ్డి, ఎర్రమ్మ కుమారుడు దారపు రాజు సీమెన్‌గా పని చేస్తున్నాడు. రాజుకు కోటబొమ్మాళి గ్రామానికి చెందిన అమ్మాయితో మే నెల 10వ తేదీన వివాహం జరిగింది. కోటబొమ్మాళిలో ఉంటున్న తన అత్తవారి ఇంటికి తన భార్య దీపికతో కలిసి ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై రాజు వెళ్లాడు. అక్కడ కొద్ది సేపు ఉండి తిరిగి ద్విచక్రవాహనం మీద స్వగ్రామం మూలపేట రా వడానికి బయలు దేరగా సవరపేట జంక్షన్ వద్ద అతివేగంగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాసేపటి కిందటే ఇంటి నుంచి బయల్దేరిన భర్త చనిపో యాడనే వార్త చెవిన పడడంతో ఆ నవ వధువు నిశ్చేష్టురాలైంది. భర్తను తలచుకుని గుండెలు అవిసిపోయేలా రోదించింది. ఇరు కుటుంబాలు, బంధువులు, గ్రామస్తుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సంతబొమ్మాళి ఎస్‌ఐ వై.సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


