చాలా అన్యాయం
హిరమండలం: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది గ్రేడ్–2 లైన్‌మెన్లుగా పిలిచే ఎనర్జీ అసిస్టెంట్ల పరిస్థితి. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఎదుగూబొదుగూ లేదు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా.. అత్యవసర పరిస్థితుల్లో సేవలందిస్తున్నా పనికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. దీంతో ఎనర్జీ అసిస్టెంట్లు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇటువంటి తరుణంలో కూటమి సర్కారు వీరికి పదోన్నతులు కల్పిస్తామంటూ ప్రకటన చేసింది. దీంతో జీతాలతో పాటు అన్ని అలవెన్సులు పెరుగుతాయని భావించారు. కానీ కేవలం జూనియర్ లైన్‌మెన్ పోస్టుల ఖాళీ ప్రాప్తికి మాత్రమే పదోన్నతులు ఇస్తామని చెప్పడంతో వారి ఆశలు నీరుగారిపోయాయి. దీంతో సగం మందికి కూడా పదోన్నతులు లేవని తేలిపోవడంతో వారు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రజలు విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కే విధంగా విధిగా ప్రతి సచివాలయానికి ఒక విద్యుత్ లైన్‌మెన్ ఉండాలని చెప్పి.. 2019 అక్టోబర్ 2న ఎనర్జీ అసిస్టెంట్లను నియమించారు. జిల్లాలో 750 మంది వరకు నియమితులయ్యారు. అప్పటినుంచి పల్లెల్లో విద్యుత్ కష్టాలు లేకుండా చూడడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా సమయంలో సైతం వీరి నుంచి విశిష్ట సేవలు అందాయి. అయితే అనంతరం ప్రొబేషనరీ పీరియడ్ ముగియడంతో వీరిని వైఎస్సార్‌సీపీ సర్వారు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించింది. 2024 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి కావడంతో పదోన్నతులకు సిద్ధపడింది. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
కూటమి ప్రభుత్వ హయాంలో ఎనర్జీ అసిస్టెంట్ల పరిస్థితి తీసికట్టుగా మారింది. వీరిని గ్రేడ్–2 లైన్‌మెన్లుగా గుర్తించినా వీరి జీతం మాత్రం పెరగలేదు. అలవెన్స్‌లు లభించడం లేదు. వీరితో పనిచేయించుకునే విద్యుత్ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా భారీ వేతనాలు లభిస్తున్నాయి. వారితోనే సమాన పనిచేస్తున్న గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లుకు మాత్రం వేతనం రూ.25 వేలు లోపే. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లు అందరికీ పదోన్నతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూనియర్ లైన్‌మెన్లుగా ప్రమోషన్లు ఇస్తామని చెప్పింది. దీంతో తమ కేడర్‌తో పాటు జీతాలు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జూనియర్ లైన్‌మెన్ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో.. అటువంటి చోట మాత్రమే పదోన్నతులు అని చెప్పడంతో నీరుగారిపోయారు. 700 మందికిపైగా ఉంటే కనీసం 200 మందికి కూడా పదోన్నతులు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే మండలానికి రెండునుంచి నాలుగు పోస్టులు వరకూ మాత్రమే జూనియర్ లైన్‌మెన్ పోస్టులు ఉంటాయి. అయితే ప్రభుత్వం తలచుకుంటే అందరికీ జూనియర్ లైన్‌మెన్లుగా పదోన్నతులు ఇవ్వొచ్చు. కానీ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు.
ప్రమాదకరంగా పనిచేస్తున్న విద్యుత్ గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లు
ఇది చాలా అన్యాయం. గ్రేడ్–2 లైన్‌మెన్లందరికీ పదోన్నతులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. అందరికీ పదోన్నతులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. తక్కువ జీతంతో పనిచేస్తున్న వారి విషయంలో కనికరం చూపాలి.
– సిర్ల ప్రసాద్,
సీఐటీయూ నాయకుడు


