డీ హైడ్రేషన్ తగ్గిస్తుంది
ఆరోగ్య రక్షణకు..
● జిల్లాలో మండుతున్న ఎండలు ● ఓఆర్‌ఎస్‌తో తక్షణ ఉపశమనం ● ఇంట్లోనే తయారు చేసుకునే అవకాశం
పాతపట్నం: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. శరీరంలో నీరు ఆవిరైపోయి జనాలు నీరసించి పోతున్నారు. ఠారెత్తిస్తున్న ఎండల తీవ్రతను తట్టుకునేందుకు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు వేసవిలో ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు పాటించడం అవసరం. సాధారణం కంటే అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఈ ఏడాది ఉన్నాయి. దీంతో శ్రామిక, ఉద్యోగ, వ్యాపారులు విధి నిర్వహణలో భాగంగా అనివార్య పరిస్థితుల్లో మండే ఎండల్లో తిరగక తప్పదు. ఉపాధి పనులు, ఇతరత్రా వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మండుటెండలో పనులు చేయాల్సి వస్తుంది. అటువంటి వారు ఎండ ప్రభావానికి లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఓఆర్‌ఎస్‌తో మేలు
ఎండల్లో పనిచేసే సమయంలో శరీరంలో సహజంగా నీటిశాతం తగ్గిపోవడం వలన వడదెబ్బకు గురవుతుంటారు. ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ఓఆర్‌ఎస్ ద్రావణం ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. స్థలం, కాలాన్ని బట్టి శరీరాన్ని నిర్దేశించిన ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి. మెదడులో హైపోథలామస్ అనే భాగం శరీరంలోని వేడిని క్రమబద్ధీకరిస్తుంది. తగిన నీటిని తాగకపోయినా, ఎండలో ఎక్కువ తిరిగినా హైపోథలామస్ భాగమే అధిక ఉష్ణోగ్రతకు లోనై క్రమబద్ధీకరించే పని చేయలేదు. ఈ స్థితిలో తల తిరగడం, నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, జ్వరం, చీకటి కమ్మినట్లు అనిపించడం, వాంతి అవుతున్న భావన కలగడం వంటి లక్షణాలు వడదెబ్బకు గురైనట్లు నిర్ధారిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యారోగ్య కార్యకర్తల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. అటువంటి సమయాల్లో వీటిని తీసుకోవడం వలన వెంటనే ఉపశమనం లభిస్తుంది. సమయానికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్ అందుబాటులో లేకపోతే ఇంటిలోనే ఉప్పు, పంచదార, నీరు సాయంతో ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. లీటరు నీటిలో చిటికెడు ఉప్పు, అరస్పూన్ పంచదారను కలిపి తాగవచ్చు. ఎండ తీవ్రతకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించడం అవసరం.
ఓఆర్‌ఎస్ తయారీ ఇలా...
ఓఆర్‌ఎస్ అనేది వివిధ లవణాల మిశ్రమంతో కూడిన 20.5 గ్రాముల సోడియం క్లోరైడ్. దీనిలో 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల సోడియం సిట్రేట్, 13.5 గ్రాముల డెక్స్‌ట్రోజ్ ఉంటాయి. ఈ పౌడర్ ప్యాకెట్‌ను సురక్షితమైన లీటరు నీటిలో కలిపి రోజు మొత్తంలో వయస్సును బట్టి తగిన మోతాదులో తాగాలి. మితిమీరిన మోతాదులో తాగడమూ అనర్థాలు తెచ్చిపెడుతుంది.
వడదెబ్బ బారిన పడినవారు డీ హైడ్రేషన్‌కు గురవుతారు. అటువంటి సమయంలో ముందుగా ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌ను వినియోగించడం వల్ల కొంతవరకు కోలుకుంటారు. ఓఆర్‌ఎస్‌లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. అవసరమైనవారు తీసుకోవచ్చు.
– డాక్టర్ జి.వేణుగోపాల్,
సూపరింటెండెంట్, పాతపట్నం సీహెచ్‌సీ


