అక్కడో చెరువుండాలి..! | - | Sakshi
Sakshi News home page

అక్కడో చెరువుండాలి..!

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

అక్కడో చెరువుండాలి..!

సాగునీటి చెరువు కబ్జా టీడీపీ నేత బరితెగింపు

వంశధార గట్టు, చెక్‌డ్యామ్‌ కూడా ధ్వంసం

జిల్లా నేత అండ చూసుకుని ఆక్రమణ

తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

అక్కడో చెరువుండాలి.. దాదాపు పదిహేను ఎకరాల భూమికి నీరిచ్చి పెంచే తల్లిగా వర్ధిల్లుతుండాలి.. కానీ ఇప్పుడు అక్కడ కేవలం స్థలం మాత్రమే కనిపిస్తోంది. యంత్రాలతో చెరువును ఛిద్రం చేసి సమాధి చేసిన ఆనవాలు తెలుస్తోంది. అధికారం ఉందనే అహంతో చెరువును చెరబట్టిన వికృత విన్యాసానికి సాక్షిగా ఈ స్థలం నిలుస్తోంది. దశాబ్దాల పాటు నీటితో కళకళలాడిన చెరువు ప్లాటుగా మారిపోయి మౌనంగా రోదిస్తోంది.

జలుమూరు:

కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, గ్రామ కంఠాలు కనుమరుగైపోతున్నాయి. మండలంలోనూ ఈ ఆక్రమణలు పెచ్చుమీరిపోతున్నాయి. కొద్ది రోజుల కిందట తిమడాంలో మండల టీడీపీ నాయకుడు, అల్లాడ సొసైటీ అధ్యక్షుడు వెలమల చంద్రభూషణరావు, పల్లి రమణలు గ్రామ చెరువు, పంచాయతీ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు తాగునీటి ట్యాంకు నీటిని తన పొలాలకు మళ్లించాడు. ఇప్పుడు మండల కేంద్రం సమీపంలోని కెల్లివానిపేట–నామాలపేట గ్రామాల మధ్య రోడ్డును ఆనుకుని సర్వే నంబర్‌ 2–77లో ఉన్న సాగునీటి చెరువును గ్రామానికి చెందిన కెల్లి బాలకృష్ణతోపాటు మరి కొందరు యంత్రాలతో కప్పేశారు. ఈ చెరువుకు సుమారు 15 ఎక రాల ఆయకట్టు కూడా ఉంది. దీనికి ఆనుకొని ఉన్న వంశధార కాలువ గట్టు, చెక్‌డ్యామ్‌ను యంత్రాలతో ధ్వంసం చేసి మరీ కప్పేశారు. సుమారు ఐదు నుంచి ఏడు ఎకరాలు విస్తీర్ణం గల ఈ చెరువు ఇప్పడు పూర్తిగా కనుమరుగైపోయింది.

రాత్రికి రాత్రి యంత్రాలతో మట్టిని తవ్వి చెరువును నామరూపాల్లేకుండా చేశారు. గతంలో ఈ చెరువు విస్తీర్ణం సుమారు 12 ఎకరాలు వరకూ ఉండేదని, ప్రస్తుతం చెరువు ఆనవాళ్లు కూ డా లేవని స్థానికులు చెబుతున్నారు. దీనిపై తహ సీల్దార్‌ జెన్ని రామారావుకు కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. జిల్లా నేత అండ చూసుకొని ఈ ఆక్రమణలకు స్థానిక టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారని గ్రామానికి చెందిన మామిడి వరహాలు నాయుడు, రామిరెడ్డి, ధర్మారావు, మెట్ట ఆనంద్‌, బమ్మిడి దాలయ్యలు తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్‌ జెన్ని రామారావుకు ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు. దీనిపై తహసీల్దార్‌ జెన్ని రామారావును వివరణ కోరగా ఫిర్యాదు అందిందని బాలకృష్ణ అనే వ్యక్తి సుమారు 42 సెంట్లు ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. అలాగే మరి కొందరు కూడా ఆక్రమణలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆక్రమణ దారులు అందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని రికార్డులు ప్రకారం సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement