● ఎల్‌ఎన్‌పేట పీఏసీఎస్‌లో గోల్‌మాల్ ● సీఈఓపై అధ్యక్షుడి ఆరోపణలు ● వడ్డీ వివరాలపై ప్రత్యేక కరపత్రం విడుదల
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట పీఏసీఎస్‌లో సరికొత్త అవినీతి అంశం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పీఏసీఎస్ అధ్యక్షుడు కాగాన మన్మధరావు వర్సెస్ సీఈఓ సింహాచలం అన్నట్టు పరిస్థితి ఉంది. రైతు లు తీసుకున్న రుణాలపై సీఈఓ అధిక వడ్డీ వసూ లు చేస్తున్నారన్న ఆరోపణలపై అధ్యక్షుడు మన్మధరావు మాట్లాడారు. పీఏసీఎస్ పరిధిలో లక్షల రూపాయలు అదనంగా వడ్డీ, డాక్యుమెంట్ చార్జీ రూపంలో వసూలు చేసినట్టు తెలిపారు. రైతుల వద్ద నుంచి వసూలు చేసిన వడ్డీకి ఇంతవరకు రైతులకు రశీదులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతులు అదనంగా వడ్డీ చెల్లించాల్సిన పనిలేదని తేల్చిచెప్పారు. ఇంత రుణానికి ఇంతే వడ్డీ కట్టాలని, అంతకు మించి కట్టాల్సిన పనిలేదంటూ ఆయన ఒక కరపత్రాన్ని నేరుగా రైతులకు అందించారు. కట్టిన వడ్డీకి రశీదులు పొందాలని, రశీదులు ఇవ్వకుంటే తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు. సీఈఓ సింహాచలంపై ఎప్పటి నుంచో అదనపు వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం అధ్యక్షుడు కాగాన మన్మధరావుకు తెలియడంతో ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రైతులకు రుణాలు, అదనపు వడ్డీల వసూలు రూపంలో భారీగా గోల్‌మాల్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.


