కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని సోంపేట రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కంచిలి పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్ర పరిధి ఝార్సుగుడ జిల్లా గుమదెరా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ అనే యువకుడు మల్కన్‌గిరి జిల్లా సోమంతపూర్ గ్రామానికి చెందిన సుమన్ వద్ద తాను సేవించడానికి, అమ్ముకోవడానికి గానూ 3.370 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. తర్వాత ఈ గంజాయిని నలుపు రంగు బ్యాగ్‌లో ప్యాక్‌చేసి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో బెంగుళూరు తరలించేందుకు సిద్ధమయ్యాడు. దీనిలో భాగంగా సోంపేట రైల్వేస్టేషన్ దగ్గరలోని రైల్వే పార్కు ముందు ఉన్న బీటీ రోడ్డు వద్ద వేచి ఉండగా కంచిలి ఎస్‌ఐ పి.పారినాయడు, పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయి నిల్వతో పాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దీనిపై సోంపేట సీఐ బి.మంగరాజు కేసు నమోదు చేశారు.


