మందస: విధ్వంసకర ఎయిర్‌పోర్టు తమకు వద్దని, దీనికోసం భూములు ఇచ్చేది లేదని మండలంలోని భేతాళపురం గ్రామస్తులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్పష్టం చేశారు. కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని ముక్తకంఠంగా తెలియజేశారు. కొబ్బరి, మామిడి, జీడి, పసస, మునగ వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో ఆర్.అప్పలరాజు, డిప్యూటీ తహసీల్దార్ కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్టు నిర్మాణంతో అభివృద్ధి
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన ఎయిర్‌పోర్టుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలోని ఎయిర్‌పోర్టు బాధిత గ్రామమైన అనకాపల్లిలో శనివారం అయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంత ప్రజలు భూమిని త్యాగం చేస్తేనే సాధ్యమవుతుందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే 10వ తరగతి నుంచి ఐఐటీ వరకు చదువుకున్న యువతకు అదే ఎయిర్‌పోర్టులోనే ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే భూమిని కోల్పోయిన రైతులకు మెరుగైన లబ్ధిని చేకూర్చుతామన్నారు. ఈ విషయంలో కొంతమంది పడుతున్న అపోహలు నిజం కాదని స్పష్టం చేశారు. కాగా కొంతమంది రైతులు, మహిళలు మాట్లాడుతూ తమ భూములు, ఇళ్లు విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. సమావేశంలో ఆర్డీవో అప్పలరాజు, తహసీల్దార్ సీతారామయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


