నేతన్న నేస్తం అమలు ఎన్నడు..? | - | Sakshi
Sakshi News home page

నేతన్న నేస్తం అమలు ఎన్నడు..?

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

రణస్థలం: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం ఎప్పటిలోగా అమలు చేస్తారో సమాధానం చెప్పాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ డిమాండ్‌ చేశారు. శనివారం లావేరు పర్యటనలో నేతన్నలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు హామీ అమలు చేయకపోవడంతో నేతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న చేనేతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. 50 ఏళ్లు దాటినవారికి పెన్షన్‌ అమలు చేస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు వెంటనే జరిపించాలని, కేంద్ర ప్రభుత్వం హ్యాండ్‌లూమ్‌ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్‌.అసిరప్పడు, కె.రామారావు, యు.కాశీ విశ్వేశరరావు, ఎన్‌.భద్రకాళి, కె.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రైలు ఢీకొని ఆవు మృతి

పాతపట్నం: మండలంలోని గంగువాడ గ్రామ రైల్వే గేటు సమీపంలో రైలు ఢీకొని ఆవు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం గంగువాడ రైల్వే గేటు సమీపంలో ఆవు మేత మేస్తోంది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి గుణుపూర్‌ వస్తున్న రైలు ఢీకొనడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గంగువాడ గ్రామానికి చెందిన సత్రాపు అప్పన్న అనే రైతుకు చెందిన ఆవుగా గుర్తించారు. ఆవు విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందన్నారు. నష్టపోయిన పాడి రైతుకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement