● విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం
శ్రీకాకుళం: జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో శతశాతం ప్రవేశాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించిన మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశానికి కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బడి పిలుస్తోంది–2026 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదు ఉత్సాహంగా సాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరంలో వంద శాతం ప్రవేశాల లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సరికొత్త వ్యూహాలతో, సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యాల సాధనలో అద్భుతమైన ప్రగతి కనబరుస్తున్న మండలాలను ప్రత్యేకంగా అభినందించారు. ఐదేళ్లు నిండిన పిల్లలను 1వ తరగతిలో చేర్పించడంలో బూర్జ, లక్ష్మీనర్సుపేట, మెళియాపుట్టి, సంతబొమ్మాళి, సారవకోట మండలాలు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. అలాగే ఉన్నత తరగతుల నమోదులో జిల్లా సగటు అత్యంత మెరుగ్గా ఉందన్నారు. లావేరు, పలాస, బూర్జ మండలాలు మంచి ప్రగతిని సాధించి ముందు వరుసలో నిలిచాయని, మిగిలిన మండలాలు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులు, లీప్ కార్యక్రమం ద్వారా అందిస్తున్న విద్యా ప్రమాణాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఈవో రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


