మండుటెండలో ఇబ్బందులు పడుతున్న సర్వేయర్లు, రైతులు
పరికరాలు లేక సతమతం అవుతున్న సర్వేయర్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్:
ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే గందరగోళంగా మారుతోంది. భూముల సర్వేకి సంబంధించిన ఈ పనులు సక్రమంగా జరగడం లేదు. సిబ్బందితో పాటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క మండుటెండల్లో పనులు చేయలేక ఇబ్బందులు పడుతుంటే, అదే విధంగా రైతులు వారి పొలాలను ఎండలో చూపించడం, అందుబాటులో ఉండడం కూడా సమస్యగానే మా రుతోంది. ఇన్ని కష్టాలకు ఓర్చి, సర్వే చేయాలనుకున్నా వసతులు ఉండడం లేదు. మరోవైపు అధికారులు సర్వేయర్లకు గడువు పెట్టి మెడపై కత్తిపెడుతున్నారు. ఇది అన్యాయం అని అడిగితే సస్పెన్షన్‌తో భయపెడుతున్నారు. ఇటీవల ఇబ్బందులపై సర్వేయర్లు నిరసనకు దిగితే జిల్లాకు చెందిన ఇద్దరు గ్రామ సర్వేయర్లు సంఘం నాయకులను సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ జరగడం, ఉన్నతాధికారులకు పిర్యాదులు చేరడంతో ఆ సస్పెన్షన్‌ను వాపసు తీసుకున్నారు. ఇలా ఇబ్బందు లు ఎన్నో ఉన్నాయి. రీ సర్వేలో పూర్తిగా పనులు సర్వేయర్లు చేయడం అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడం, కొన్ని సమస్యాత్యక గ్రామాల్లో భయంభయంగా సర్వేలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
‘మే’లో ఇబ్బంది
ప్రస్తుతం జిల్లాలో ఫేజ్–3, ఫేజ్–4 గ్రామాలు అంటే ఫేజ్–3లో 85 గ్రామాలు, ఫేజ్–4లో 165 గ్రా మాల్లో రీ సర్వేలు జరుగుతున్నాయి. అయితే వసతులు లేక సర్వేయర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధానంగా స్టేషనరీ, కంప్యూటర్లు, ప్రింటర్లు వంటివి లేవు. రోవర్లు కూడా సరిపడినన్ని లేకపోవడంతో పని వేగంగా జరగడం లేదని సర్వేయర్లు వాపోతున్నారు. మే నెలలో ఈ సర్వేలు చేయడంతో సర్వే సమయంలో రైతులు అందుబాటులోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందుల మధ్య సర్వేలు జరిగితే మళ్లీ తప్పులతో కూడిన రికార్డులు తయారయ్యే ప్రమాదం ఉంది. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే సగానికిపైగా సర్వే పూర్తయ్యింది. అప్పుడే బేస్ స్టేషన్లు, రోవర్లు, డ్రోన్ కెమెరాలు వంటివి సరఫరా చేశారు. మొత్తం 1465 రెవెన్యూ గ్రామాలు ఉండగా, వీటిలో గత ప్రభు త్వం 738 గ్రామాల్లో సర్వేను మూడు దశల్లో పూర్తి చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రీ సర్వే అన్నారు. పైలెట్ సర్వేగా 40 గ్రామాల్లో సర్వే చేశారు. ఫేజ్–2 లో 49 గ్రామాలు, ఫేజ్–3లో 85 రెవెన్యూ గ్రామాలు, ఫేజ్–4లో 165 రెవెన్యూ గ్రామాల్లో సర్వేకు సిద్ధమయ్యారు. ప్ర స్తుతం ఫేజ్–3, ఫేజ్–4 సర్వేలు జరుగుతున్నాయి.
డిప్యుటేషన్లతో సమస్యలు
తాజాగా జరుగుతున్న రీ సర్వే కోసం చాలా మందిని డిప్యుటేషన్ పద్ధతిలో నియమించారు. ఉదాహరణకు శ్రీకాకుళం రూరల్ మండలం నుంచి 12 మంది గ్రామ సర్వేయర్లను రణస్థలం, ఇతర మండలాలకు గ్రామాలకు రీ సర్వేకి నియమించారు. దీంతో వారి సొంత గ్రామాల్లో సమస్యలు పెండింగ్ లో ఉండిపోతున్నాయి.
ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు గ్రామ సచివాలయం, మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.


