ఇలా అయితే ఎలా..? | - | Sakshi
Sakshi News home page

ఇలా అయితే ఎలా..?

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

ఇలా అయితే ఎలా..? ● నగరంలోని రోడ్డుపై చెత్త ఉండడంతో కలెక్టర్‌ ఆగ్రహం ● ఎంహెచ్‌వోకు చార్జి మెమో జారీ ● శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌కు ఆదేశాలు ముందుగానే గమనించి...

● నగరంలోని రోడ్డుపై చెత్త ఉండడంతో కలెక్టర్‌ ఆగ్రహం ● ఎంహెచ్‌వోకు చార్జి మెమో జారీ ● శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌కు ఆదేశాలు

శ్రీకాకుళం:

శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి డాక్టర్‌ సుధీర్‌కు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ చార్జి మెమో జారీ చేశారు. శుక్రవారం జిల్లాలోని వేరొక ప్రాంతానికి కలెక్టర్‌ తన వాహనంలో వెళ్తున్నారు. నగరంలోని అరంగ వీధికి వెళ్లేసరికి రోడ్డు పక్కన ఉన్న చెత్తను చూసి తన వాహనాన్ని నిలుపు దల చేశారు. అక్కడినుంచే ఎంహెచ్‌వోకు ఫోన్‌ చేసి రమ్మని పిలిచారు. అక్కడ చెత్తని చూపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అప్పటికే తన జేబులో ఉన్న చార్జ్‌ మెమోను అందజేశారు. కలెక్టర్‌ వార్డులోకి వచ్చిన విషయం తెలుసుకొని ఆ ప్రాంత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కావ్య అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో కమిషనర్‌ కూడా వచ్చారు. కావ్యను పరిస్థితి ఇలా ఉండడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఉదయమే తాను శుభ్రం చేయించానని.. రెండు రోజుల క్రితం వరకు ఇక్కడ డస్ట్‌బిన్‌ ఉండేదని దానిని తొలగించారని చెప్పారు. ఉదయం శుభ్రం చేయిస్తే ఇంత చెత్త ఇక్కడ ఎందుకు ఉంటుందంటూ కలెక్టర్‌ నేరుగా తన చేతితో అక్కడ ఉన్న చెత్తను ఓ పేపర్‌లోనికి చూపించారు. డస్ట్‌ బిన్‌ ఎందుకు తొలగించారంటూ మండిపడుతూ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని కమిషనర్‌ కుర్మారావుకు ఆదేశించారు.

నాలుగు నెలల్లో నాలుగో సారి

ఎంహెచ్‌వో సుధీర్‌కు గడిచిన నాలుగు నెలల్లో సంజాయిషీ నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి. నగరంలో డయేరియా ప్రబలినప్పుడు కమిషనర్‌ను అకారణంగా సస్పెండ్‌ చేయగా, ఎంహెచ్‌వోకు మెమో జారీ చేశారు. ఆ తర్వాత అధికారులు విచారణ జరిపి మరోసారి నోటీసులు ఇచ్చి డయేరియా ప్రబలడానికి కారణంపై వివరణ కోరారు. దీనికి సమాధానం ఇవ్వగా అప్పట్లో నగరపాలక సంస్థ పర్యవేక్షణాధికారిగా నియమితులైన జేసీ ఎంహెచ్‌వో ఇచ్చిన వివరణకు సంతప్తి చెందలేదని పేర్కొంటూ పూర్తి ఆధారాలతో వివరణ ఇవ్వాలని నోటీసును జారీ చేశారు. ఈ మూడు నోటీసులకు ఆయనే ఏం సమాధానం చెప్పారో తెలియనప్పటికీ ఎంహెచ్‌వోపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా కలెక్టరే నేరుగా చార్జి మెమో జారీ చేయడం విశేషం. దీనిపై ఎంహెచ్‌వో ఎటువంటి వివరణ ఇస్తారో.. అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

డన్‌బిన్ల తొలగింపు

నగరంలోని పలు ప్రాంతాల్లో డస్ట్‌బిన్లను ఎంహెచ్‌వో ఇటీవల తొలగింపజేశారు. దీనిపై పలువురు ఆయనను కలిసి డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్‌ తొలగించాలని ఆదేశించారని.. డస్ట్‌బిన్‌ రహిత నగరంగా శ్రీకాకుళం తీర్చిదిద్దాలని కలెక్టర్‌ యోచిస్తున్నారని చెప్తూ వచ్చారు. అయితే శుక్రవారం జరిగిన ఘటనలో కలెక్టరే డస్ట్‌ బిన్‌ ఎందుకు తొలగించారని ప్రశ్నించడంతో కావాలనే ఎంహెచ్‌వో కొన్ని ప్రాంతాల్లో డస్ట్‌బిన్లు తొలగించారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

కలెక్టర్‌ శుక్రవారం ఉదయం నగరంలోని ఒకచోటకు సొంత పనిమీద వెళ్లారు. ఆ సమయంలోనే కొన్నిచోట్ల చెత్తను చూశారు. దీనిపై ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి పలాస వెళ్తున్న క్రమంలో చెత్త ఉన్నచోట ఆగి ఎంహెచ్‌వోను పిలిచి చార్జి మెమో అందజేశారు. ముందుగానే చెత్తను పరిశీలించడం, తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటే చార్జీ మెమో జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి, మెమోను తన కార్యాలయంలోనే సిద్ధం చేసుకొని వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా కలెక్టర్‌ చెత్త ఉన్నచోట ఆగి చేతితో చెత్త ఎత్తుతున్న సమయంలో నగరపాలక సంస్థ అధికారులు గానీ.. మరెవరు గానీ లేకపోగా, అక్కడ ఒక ఇన్‌ఫ్లూయన్సర్‌ ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement