హిరమండలంలో
బడి పిలుస్తోంది ర్యాలీ
నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు
హిరమండలం: ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినా ఉపాధ్యాయులకు మాత్రం సెలవులు లేవు. మండుటెండల్లోనూ ప్రతి రోజూ ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని విద్యాశాఖ హెచ్చరిస్తోంది. మండు వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు సూచిస్తున్న ప్రభుత్వం ఉదయం పది నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. తమకు మాత్రం వేళాపాళా లేకుండా బడిపిలుస్తోంది ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించడం ఏమిటని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పిల్లల్ని చేర్పించాల్సిందే..
ప్రతి ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని టీచర్–విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఈ సంఖ్య లేకపోతే ఆ ఉపాధ్యాయుడిని వేరొక స్కూలుకు పంపుతామని ఇప్పటినుంచే విద్యాశాఖాధికారులు ఒత్తిడి పెడుతున్నారు. పాఠశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలను సమీప స్కూల్‌లో విలీనం చేస్తారని, ఆ పోస్టులు సైతం రద్దయ్యే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తుండటంతో ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహిళా ఉపాధ్యాయులు, రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న టీచర్లను సైతం బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తుండడంతో మండుటెండలో తిరిగి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలను బడుల్లో
చేర్పించాలని ఉపాధ్యాయులకు టార్గెట్లు
లేకుంటే పోస్టులు రద్దవుతాయని హెచ్చరికలు


