గంజాయి రవాణా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణా గుట్టురట్టు

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

వేర్వేరు ఘటనల్లో 36 కేజీల గంజాయితో నలుగురు అరెస్ట్‌

ఇచ్ఛాపురం:

చ్ఛాపురం రైల్వేస్టేషన్‌ ఆవరణలో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 22 కేజీల 500 గ్రాముల గంజాయితో మహారాష్ట్ర రాష్ట్రం జల్నాకు చెందిన రాహుల్‌విష్ణు ఇంగ్లే అనే వ్యక్తి పట్టుబడినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితుడు ఇంగ్లేకు.. జల్నా గ్రామంలో గంజాయి వ్యాపారం చేసే సురేష్‌ కై లాష్‌ఠాకూర్‌తో పరిచయం ఏర్పడింది. అతని వద్ద కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చలేకపోవడంతో వ్యాపారి సూచించినట్లు గంజాయి అందజేస్తే రాకపోకల ఖర్చులు పోగా కేజీ గంజాయికి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఒడిశాకు చెందిన రాజేష్‌ నిందితుడు ఇంగ్లేకు గంజాయిని అందజేశాడు. దానిని తీసుకొని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ గుండా మహారాష్ట్రకు వెళ్లేందుకు సిద్ధమవ్వగా రైల్వేస్టేషన్‌ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు. గంజాయి పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పట్టణ పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు

పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు మహిళల నుంచి పొందూరు పోలీసులు 5 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, పొందూరు ఎస్సై వి.సత్యనారాయణలు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎస్సీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పొందూరు ఎస్సైకు వచ్చిన సమాచారంతో పొందూరు రైల్వేస్టేషన్‌కు గురువారం పోలీసు సిబ్బంది చేరుకున్నారు. స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను గుర్తించి వారి సామాన్లు తనిఖీ చేశారు. వారి వద్ద 5 కేజీల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మహిళలను విచారించగా మహారాష్ట్రకు చెందిన మంగళ దీపకజాదూ, మనోబై సంపత్తిలుగా గుర్తించారు. వీరిద్దరూ ఒడిశా రాష్ట్రం ఛత్రపూర్‌లో రాజేష్‌ అనే వ్యక్తి వద్ద రూ.25 వేలకు ఐదు కేజీల గంజాయి కొనుగోలు చేశారు. మహారాష్ట్ర చేరుకునేందుకు శ్రీకాకుళం స్టేషన్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాల్సి ఉంది. పొరపాటున శ్రీకాకుళం అనుకుని పొందూరులో రైలు దిగిపోయారు. దీంతో ఇద్దరూ పట్టుబడ్డారు. పొందూరు డీటీ రాధాకృష్ణ, వీఆర్‌వోలు సమక్షంలో మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. గంజాయి పట్టుకున్న ఎస్సైను సీఐ అవవతారం అభినందించారు.

స్కూటీపై గంజాయి తరలిస్తూ..

ఇచ్ఛాపురం రూరల్‌: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చేసినట్లు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. గురువారం నిందితుడిని విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. రూరల్‌ ఎస్‌ఐ ఆర్‌.జనార్దనరావు గురువారం మధ్యాహ్నం ఎం.తోటూరు రైల్వే క్రాసింగ్‌ వద్ద తనిఖీలు చేపడుతుండగా ఒడిశాకు చెందిన లికు బెహరా అనే వ్యక్తి స్కూటీపై 8.430 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే బెహరాను అదుపులోకి తీసుకొని గంజాయి, స్కూటీ, సెల్‌ ఫోన్‌ను స్వాఽధీనపరచుకున్నారు. విచారణలో ఒడిశా రాష్ట్రం ఖందమాల్‌ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి రైల్వే మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించారని తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు మత్తు పదార్థాలు, గంజాయిని తరలిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో రూరల్‌ ఎస్‌ఐ ఆర్‌.జనార్దనరావు పాల్గొన్నారు.

పొందూరు: పట్టుబడిన మహిళలతో పోలీసులు

ఇచ్ఛాపురం: వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement