చిన్న విషయాలకే.. చితికిపోతున్నారు! | - | Sakshi
Sakshi News home page

చిన్న విషయాలకే.. చితికిపోతున్నారు!

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

క్షణికావేశంలో ఆత్మహత్యలకు

పాల్పడుతున్న యువత

చిన్న వయసులోనే ముగించేస్తున్న జీవితాలు

వారం వ్యవధిలో జిల్లాలో 10 మంది

ఆత్మహత్య

ప్రతి సమస్యకూ పరిష్కారం

ఉందంటున్న మానసిక నిపుణులు

శ్రీకాకుళం క్రైమ్‌/టెక్కలి:

జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది.. అయితే కొందరు ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచిస్తూ చావే పరిష్కారంగా విలువైన జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు.. క్షణికావేశంలో చేస్తున్న ఇటువంటి మరణాల వలన వారి కుటుంబాలు నడిరోడ్డున పడుతున్నాయి.. ప్రస్తుతం వివిధ రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్న ఎంతో మంది మేధావులు ఒకప్పుడు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాకే ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అటువంటి వారి జీవిత చరిత్రలను ప్రతి రోజూ చూస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒంటరి తనంగా తీసుకునే నిర్ణయాలతో నిండు జీవితాలను కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఈ తరహా ఘటనలు అధికమవున్నాయి. ముఖ్యంగా యువత చిన్న విషయాల కే ‘చితి’కిపోతున్నారు. ఈ తరుణంలో ఎటువంటి సమస్య ఎదురైనా ఒక్క క్షణం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇటీవల ఘటనలు..

● ఈ ఏడాది ఏప్రిల్‌ 10న జేఆర్‌ పురంలో నాగవరపు వీరబాబు (39) మతిస్థిమితం సరిగ్గా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే తన ఇంటిని మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు పోలీసులు సమక్షంలో కూల్చేశారని పలాస సూదికొండ కాలనీకి చెందిన దళిత మహిళ ఏప్రిల్‌ 10న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

● మే 14న ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో తల్లితో గొడవపడి రాజేష్‌, గార మండలం గిడిపేటలో భార్య మద్యం తాగొద్దన్నందుకు కర్రి త్రినాధరావు చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించారు. సారవకోట మండలం కురిడిలో భాస్కరరావు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● మే 10న సారవకోటలో కుటుంబ కలహాలతో కలుపు మందు తాగి తిరుపతి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

● మే 5న వజ్రపుకొత్తూరు మండలం చిన్న పల్లివూరుకు చెందిన గర్తం ఇందు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది.

● టెక్కలి తలగాంకు చెందిన వీరఘట్టం అనూష మే 4న ఆత్మహత్య చేసుకుంది.

● మే4న జి.సిగడాంలో తన భర్త హోంగార్డు శ్యామ లరావు మద్యానికి, బెట్టింగ్‌లకు బానిసై బంగారాన్ని అమ్మేయడంతో భార్య ఉరి వేసుకుంది.

● మే 1న టెక్కలి ఆంధ్రావీధిలో డి.రామకృష్ణ తన భార్యపై దాడి చేసి ఆపై కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

● ఏప్రిల్‌ 12న బూర్జ మండలానికి చెందిన చుక్కర తవుడు అనే రైతు అకాల వర్షాలకు పంటలు నాశనమవ్వడంతో గడ్డి మందు తాగి బలవణ్మరణానికి గురయ్యాడు.

● అప్పు ఇస్తే తిరిగి అవతలివారే కేసు పెట్టడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్‌ 11న పాతపట్నం చిన లోగిడికి చెందిన ఆటో డ్రైవర్‌ దయానిధి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆటో డ్రైవరు ఆత్మహత్య

పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జయరామచంద్రపురం గ్రామానికి చెందిన పూడి చిన్నబాబు(31) బుధవారం రాత్రి గ్రామ శివారులో ఉన్న టేకుతోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నబాబు తాళబద్ర గ్రామ సంబరాలకు స్నేహితుడు శేఖర్‌తో కలిసి వెళ్లాడు. అక్కడ మద్యం సేవిస్తూ ఇద్దరు గొడవ పడ్డారు. శేఖర్‌ చిన్నబాబుపై చేయికోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అప్పుడే అతను తాను చనిపోతానని చెప్పాడు. చెప్పిన ప్రకారం మద్యం మత్తులో ఉన్న చిన్నబాబు అదే రోజు రాత్రి తన ఇంటికి వెళ్లకుండా ఊరు శివారులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కౌన్సెలింగ్‌ అవసరం..

కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినపుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేకపోతే మానసిక వైద్య నిపుణుల కౌన్సెలింగ్‌ అవసరం పడుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని కచ్చితంగా దూరం పెట్టవచ్చు. మనిషి సైకాలజీ ప్రకారం.. ఎంతటి పెద్ద సమస్యకై నా కచ్చితంగా సమాధానం ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచిస్తే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు.

– నిర్మల్‌ అలెగ్జాండర్‌, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి

Advertisement
 
Advertisement
Advertisement