రణస్థలం: వ్యవసాయానికి పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా పంటలు మద్దతు ధరలు పెంచాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల రమణ, ఏపీ రైతు సంఘం నాయకులు మజ్జి రమణ డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటల మద్ధతు ధరలు నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ఖండిస్తూ కొండములగాం గ్రామంలో కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ పంటల మద్ధతు ధరల జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రూ.2400 ఉండగా కేవలం పది రూపాయలు పెంచి రూ.2410 నిర్ణయించడం, వరికి క్వింటాలుకు రూ.2441గా నిర్ణయించడం రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు. 13 రకాల పంటలకు అతి తక్కువ ధరలు నిర్ణయించడం దారుణమన్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగాయని, సాగు ఖర్చులు పెరిగాయని దానికి తగినట్లు మద్ధతు ధర పెంచలేదని విమర్శించారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా, రసాయనిక ఎరువుల ధరలు మాత్రం 50 కిలోల బస్తాపై రూ.350 వరకు పెంచడం దుర్మార్గమన్నారు. యుద్ధం సాకుతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం పేద ప్రజలపైన, చిన్న, సన్నకారు రైతులపైన భారం మోపడమేనని అన్నారు. డాక్టర్ స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని, రసాయనిక ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ని రామినాయుడు, దన్నాన సూర్యనారయణ, పి.అప్పలరాము తదితరులు పాల్గొన్నారు.


