శ్రీకాకుళం కల్చరల్ : మార్కెట్‌లో నేరేడు పండ్లకు భలేగిరాకీ ఏర్పడింది. ఈ సీజన్‌లో లభించే అద్భు తమైన ఆరోగ్యకరమైన పండు కావడంతో కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, బరువు తగ్గడంలో సహాయపడటంలో నేరేడు పండు ముందంజలో ఉంటోంది.
ఇవీ ప్రయోజనాలు..
నేరేడు పండు మధుమేహ నియంత్రణలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే జంబోలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ బాధితులకు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకం, విరేచనాలు వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. విటమిన్–సి, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అయితే, నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు.పాలు తాగిన వెంటనే వీటిని తీసుకోవడం మంచిది కాదు.


