పింఛనో రామచంద్రా..! | - | Sakshi
Sakshi News home page

పింఛనో రామచంద్రా..!

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

హిరమండలం:

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కొత్త పింఛన్ల మంజూరుపై నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు అందజేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ ఊసెత్తడం లేదు. అర్హులైన వేలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టు తిరుగుతున్నా చంద్రబాబు సర్కార్‌ కనికరించడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు చేయకపోవడంతో అనేక మంది ఆపసోపాలు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పక్కాగా పింఛన్లు అందించేవారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వలంటీర్లు దరఖాస్తు పూర్తి చేసి, సచివాలయాల్లో ఇస్తే పింఛన్లు మంజూరయ్యేవి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగింది. కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీంతో గత ప్రభుత్వంలో సాధ్యమైనది ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లాలో 50 ఏళ్లు వయస్సు దాటినవారు సుమారు 1,45,440 మంది ఉన్నారు. 60 ఏళ్లు దాటినవారు, వితంతువులు, దివ్యాంగులు కూడా దాదాపు 20 వేల మందికి పైగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లపై రోజుకో మాటతో కాలం గడుపుతోంది. దీంతో ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హిరమండలం సచివాలయం

చెప్పులు అరిగేలా తిరుగుతున్నా

నా భర్త దాదాపు పది నెలలు క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. జీవనోపాధి కోసం కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. సచివాలయానికి కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్‌కు దరఖాస్తు తీసుకోవడం లేదు. కుటుంబ పోషణ కష్టమవుతోంది. దీన స్థితిలో ఉన్న మాపై ప్రభుత్వానికి కనికరం కలగడం లేదు.

– మద్దిలి దేవి, తంప గ్రామం, హిరమండలం

ఏడాదిన్నరగా ఎదురుచూపులు

ఏడాదిన్నర క్రితం నా భర్త చనిపోయాడు. కూటమి ప్రభుత్వం వస్తే తనలాంటి వితంతువులకు వెంటనే పింఛన్‌ ఇస్తామన్నారు. ఒకటిన్నర సంవత్సరంగా సచివాలయానికి తిరుగుతున్నా.. కొత్త పింఛన్‌ మంజూరు చేయడం లేదు. ఉత్తర్వులు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలి.

– ముద్దాడ కనకమ్మ, హిరమండలం

ఉన్నవాటిని తొలగించడం దారుణం

కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారు. అర్హులకు పింఛన్లు ఇవ్వకపోగా.. ఉన్న పింఛన్లు కూడా తొలగించే పనిలో బిజీగా ఉన్నారు. అనర్హత పేరుతో చాలామందిని పింఛన్‌ అర్హత జాబితా నుంచి తొలగించారు. దీంతో వారంతా ప్రస్తుతం జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. – మీసాల వెంకట రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, హిరమండలం

Advertisement
 
Advertisement
Advertisement