శ్రీకాకుళం పాతబస్టాండ్: నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ పనులను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంప్లెక్స్ ప్రధాన ద్వారం పనులు, విశాలమైన పార్కింగ్ ఏరియా, పాదచారుల కోసం ఏర్పాటు చేస్తున్న టైల్స్ పనులను ఆయన నిశితంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, కాంప్లెక్స్ ఆవరణలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన వాలుతో నేరుగా డ్రెయిన్లలోకి వెళ్లేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాహనదారుల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ ఏరియాను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్ల కోసం పార్కింగ్ ఆవరణలోనే ప్రత్యేక విశ్రాంతి గదులు, ఆధునిక కేఫెటేరియాతో పాటు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను సూచించారు.


