శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంనకు చెందిన బాక్సింగ్ క్రీడాకారులు జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్‌బాబు కొనియాడారు. ఇటీవలి విశాఖపట్నంలో జరిగిన శాప్‌లీగ్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 12 పతకాలతో సత్తాచాటారు. వీటిలో మూడు బంగారు, ఏడు రజత, మరో రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులను బుధవారం స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో డీఎస్‌డీవో అభినందించారు. వీరిని తీర్చిదిద్దుతున్న డీఎస్‌ఏ బాక్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంత లక్ష్మణ్‌దేవ్ (అను), బి.సీతారాం, వంగా మహేష్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.


