జి.సిగడాం: మండలంలోని పెంట గ్రామంలో పొగిరి అరుణకుమారి ఇంట్లో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న ఫ్రిజ్, ఇన్వర్టర్, బియ్యంతో పాటు వివిధ రకాల సామగ్రి కాలిబూడిదయ్యాయి. దీంతో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిళ్లిందని బాధితురాలు బోరున విలపించింది. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో గ్రామస్తులు పరుగులు తీసి మంటలను అదుపు చేశారు. ప్రమాదం సమాచారం తెలుసుకొని మాజీ సర్పంచ్ పున్నాన అక్కలనాయుడు, ఎంపీటీసీ మక్క శ్రీనివాసరావు, విశ్రాంత మేనేజర్ మక్క పెద్ద అప్పలనాయుడు, పున్నాన శ్రీనివాసరావు, మక్క గురినాయుడులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు.
పిడుగుపాటుకు మహిళ మృతి
జి.సిగడాం: మండలంలోని జాడ గ్రామంలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం సాయంత్రం గ్రామానికి చెందిన కోరాడ కళావతి(40) పొలంలో గొర్రెలు కాస్తుండగా ఒక్కసారిగా పిడుగుపాటు సంభవించింది. దీంతో కళావతి తీవ్రగాయాలు పాలయ్యింది. వెంటనే 108 వాహనంలో రాజాం అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు. అలాగే రెండు గొర్రెలు చనిపోయాయి. బుధవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెలిచేటి సందీప్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
క్రైస్తవ హక్కులు కాపాడాలి
సరుబుజ్జిలి: క్రైస్తవులు, దళిత హక్కులకు భంగం కలగకుండా రక్షణ కల్పించాలని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి ఫౌండర్ వైఎస్ చిన్నారావు, ప్రతినిధులు ప్రత్తిపాటి ప్రసాదరావు, పీటర్ కామేశ్వరరావు, రవికుమార్ కోరారు. ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేజీ బాలకృష్ణన్‌ను బుధవారం ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందించారు. రాజ్యాంగపరంగా కల్పించినటువంటి సంక్షేమం, హక్కులు రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విన్నవించారు. హక్కుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చైర్మన్ హమీ ఇచ్చారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
టెక్కలి: స్థానిక పెద్దబ్రాహ్మణ వీధిలో విద్యుత్ షాక్‌కు గురై దూపాన కామేశ్వర్‌రెడ్డి (63) అనే వ్యక్తి బుధవారం మృతి చెందారు. ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈయన మృతికి బీజేపీ మండల అధ్యక్షుడు జర్జాన రామ్‌జీతో పాటు పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
వడదెబ్బతో వృద్ధుడు మృతి
సోంపేట: పలాసపురం గ్రామానికి చెందిన సింహాచలం పాిణిగ్రాహి(65) వడదెబ్బతో బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఉక్కపోతతో చనిపోయినట్లు పేర్కొన్నారు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


