కందుకూరి విగ్రహం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

కందుకూరి విగ్రహం ఆవిష్కరణ

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

శ్రీకాకుళం అర్బన్‌: నగరంలోని శాంతినగర్‌ కాలనీలో ఉన్న గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్మృతివనంలో తెలుగు రచయితల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకటరమణమూర్తి పర్యవేక్షణలో ప్రముఖ విద్యావేత్తలు సురంగి మోహన్‌రావు, బలివాడ మల్లేశ్వరరావు, బరాటం లక్ష్మణరావుతో పాటు తెరవే బృందం సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడాచారాలతో కునారిల్లుతున్న సమాజ గతిని వితంతు పునర్వివాహం జరిపించి మలుపు తిప్పిన సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు అన్నారు. బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు సీ్త్ర విద్యను ప్రోత్సహించిన మహనీయుడని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించి వరకట్నం వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడిగా నిలిచిన కందుకూరి స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో తెరవే ప్రతినిధులు వాడాడ శ్రీనివాసరావు, డాక్టర్‌ కోమలరావు, డాక్టర్‌ నిక్కు అప్పన్న, ఇద్ది పాపయ్య, సోడవరం ఈశ్వరరావు, తలగాన లింగరాజు, చదువుల చలపతిరావు, కుప్పిలి త్రినాథరావు, బి.మోహన్‌గాంధీ, కనుగుల సత్యం, వావిలపల్లి రాజారావు, గాంధీ మందిర ప్రతినిధులు కొంక్యాన వేణుగోపాల్‌, పొన్నాడ రవికుమార్‌, మెట్ట అనంతంభట్లు, గుత్తు చిన్నారావు, పందిరి అప్పారావు, జి.నాగేశ్వరరావు, బీకే జయలక్ష్మి, శాస్త్రి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement