● బొడ్డపాడులో ఘనంగా అమరవీరుల
స్మారక సభ
పలాస: సమాజంలో అసమానతలు ఉన్నంతవరకు విప్లవోద్యమాలు ఉంటాయని, వాటిని ఎవరూ అరికట్టలేరని వివిధ విప్లవ ప్రజా సంఘాల నాయకులు అన్నారు. నాటి నక్జలబరి, శ్రీకాకుళ సాయుధ పోరాటాలు భవిష్యత్ తరానికి అవసరమని, వాటి స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు. మండలంలో బొడ్డపాడులోని జిల్లా అమరవీరుల స్మారక మందిరంలో బుధవారం 37వ అమరవీరుల స్మారక సభ నిర్వహించారు. స్మారక సభ నిర్వాహక కమిటీ కన్వీనర్ పోతనపల్లి కుసుమ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోలా ఈశ్వరరావు, లిబరేషన్ రాష్ట్ర కమిటీ నాయకులు డి.హరనాథ్, జనశక్తి జిల్లా కార్యదర్శి కోనేరు రమేష్ తదితరులు మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, ప్రజల జీవన వ్యవస్థ సంక్షోభంలో పడిందన్నారు. అంతకుముందు అరుణ పతాకాన్ని అమరజీవి పోతనపల్లి పారమ్మ జీవిత సహచరుడు జోగి కోదండరావు, జయక్క కుమారుడు మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం అరుణోదయ కళాకారులు ఓ అరుణ పతాకమా అనే పాటను పాడి వినిపించారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు తామాడ సన్యాసిరావు, మద్దిల రామారావు, కొర్రాయి నీలకంఠం, మురిపింటి గంగయ్య, సొర్ర రామారావు, జయలక్ష్మి, విరసం రాష్ట్ర కార్యదర్శి రివేరా తదితరులు పాల్గొన్నారు.


