కొండపోరంబోకు భూములను జిరాయతీగా
మార్చేందుకు
ఆర్డీవో ఇచ్చిన
నో అబ్జక్షన్
సర్టిఫికెట్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అసలే అది కొండ పోరంబోకు. గతంలో కొందరికి ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూమి ఇది. అసైన్డ్‌దారుల పేరున ఉండాల్సిన భూమి ఒక ఆర్డీవో నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారని చూపించి 2011లో జిరాయితీగా మార్చేశారు. దాని ఆధారంగా సెంట్లు లెక్కన విక్రయాలు చేపట్టారు. ఒకే భూమిని నలుగురైదుగురికి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూబాగోతమంతా ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలో గ్రామంలో చోటుచేసుకుంది. కొందరు టీడీపీ నేతలు చేసిన నిర్వాకం కారణంగా అసైన్డ్‌దారులు, కొనుగోలుదారులు తిప్పలు పడుతున్నారు. కొండపోరంబోకు జిరాయితీగా ఎలా మార్చారు? ఒకే భూమిని నలుగురైదుగురికి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు అన్నది ప్రస్తుత అధికారులకు అంతుచిక్కడం లేదు.
ఎస్‌ఎంపురంలో ఆక్రమణల చరిత్ర
ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలో జరిగినన్ని భూ ఆక్రమణలు ఎక్కడా జరిగి ఉండవేమో. అక్కడున్న కొండలన్నీ కొందరు ఆక్రమించేశారు. కొండ పోరంబోకు కాస్త జిరాయితీ భూముల్లో రికార్డులో మార్పిడి చేయించారు. ఆపైన క్రయ, విక్రయాలు జరిపేశారు. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ నాయకుల పాత్ర వెలుగు చూస్తూనే ఉంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. జేసీ కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. రికార్డుల్లో అక్రమంగా నమోదు చేసిన పేర్లు, భూమి స్వభావాన్ని సరిచేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడ ఘోరాలు చూసి అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. చివరికి, విద్యాలయాల భూములు కూడా ఆక్రమించేశారు.
అసైన్డ్‌కు నో అబ్జక్షనా..!
తాజాగా ఎస్‌ఎంపురంలోని పాత సర్వే నెంబర్ 112లో కొండపోరంబోకు భూములు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పలు విద్యా సంస్థలకు ప్రభుత్వాలు కేటాయించిన దాఖలాలు ఉన్నాయి. ఆ సర్వే నంబరే తర్వాత కాలంలో 630గా మారి, పలు సబ్ డివిజన్‌లతో కొందరు పేదలకు ప్రభుత్వం అసైన్డు చేసి కేటాయించింది. ఇలా 630–4లో ఎకరా 17సెంట్లు ఒకరికి, 630–5లో 93 సెంట్లు ఒకరికి, 630–7లో 97 సెంట్లు ఒకరికి, 630–8లో 82 సెంట్లు ఒకరికి, 630–9లో 99 సెంట్లు ఒకరికి, 630–10లో 34 సెంట్లు ఒకరికి, 630–11లో 21సెంట్లు చొప్పున ఒకరికి ప్రభుత్వం అసైన్డు భూమిగా ఇచ్చింది. పేదలకు ఇచ్చిన భూములు ఎప్పటికీ ప్రభుత్వ భూములుగానే ఉండాలి. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయిస్తే నిర్దేశిత కాల వ్యవధి తర్వాత విక్రయించుకోవడానికి వీలుగా కలెక్టర్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అటువంటిదేమీ జరగలేదు. పక్కా గా పేద రైతులకిచ్చిన భూమి ఇది. కానీ, 2011లో దాదాపు 6.21 ఎకరాలకు ఓ ఆర్డీవో ఇచ్చిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ చూపించి, జిరాయితీగా మార్చి, ఆ పత్రాలు చూపించి అడ్డగోలుగా విక్రయాలు చేపట్టారు. అసైన్డుదారులకు సంబంధం లేకుండా ఎస్‌ఎంపురంలోని గణపతి, యుగంధర్, తదితర వ్యక్తులు విక్రయాలు చేపట్టి, రిజిస్ట్రేషన్లు చేసేశారు. సెంటు రూ.80వేలు చొప్పున సొమ్ము చేసుకున్నారు.
ఒకే స్థలానికి నాలుగైదు రిజిస్ట్రేషన్లు..
గణపతి, యుగంధర్ తదితర వ్యక్తులు ఆ భూములను సెంట్లు లెక్కన విక్రయాలు చేపట్టడమే కాదు ఒకే భూమిని నలుగురైదుగురికి రిజిస్ట్రేషన్ చేసేశారు. బొడ్డేపల్లి శ్రీనివాసరావు భార్య నాగమణి ...సదరు యుగంధర్ నుంచి సెంటు రూ.80వేలు చొప్పున 11సెంట్లు రూ.8లక్షల 80వేలకు కొనుగోలు చేసి 2015లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఆ పత్రాలు పట్టుకుని భూమిలోకి వెళ్లారు. అదే భూమిపై మరికొందరు తమదంటూ వచ్చారు. దీంతో తనకు అమ్మకం చేసిన యుగంధర్‌ను అడగ్గా నాగమణిపై కొందరు దాడికి దిగారు. తాజాగా ఆ పత్రాలు పట్టుకుని రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లగా...అదే సమయంలో ఆ భూమికి చెందిన అసలు అసైన్డుదారు వచ్చి.. తనది ఆ భూమి అని పత్రా లతో చూపించడంతో నాగమణి అవాక్కయ్యారు. అదే భూమిని మరికొందరికి 2017, 2018, 2022లో విక్రయించినట్టు తేలడంతో ఆందోళనకు లోనయ్యారు. ఇంత దారుణమా అని ఆమె లబోదిబోమంటున్నారు. విక్రయించిన వ్యక్తి కూడా నాగమణికి బంధువు కావడం విశేషం. తాజాగా, కొండపోరంబోకు భూములను జిరాయితీగా ఎలా మార్చారు? అనే విషయమై కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తాత్కాలికంగా 22ఎలో పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.
తనకు విక్రయించిన భూమినే మరికొందరికి
విక్రయించారంటున్న బొడ్డేపల్లి నాగమణి
జిరాయితీగా మారిన కొండపోరంబోకు
నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌తో రికార్డుల మార్పిడి
అసైన్డ్ భూములపై రిజిస్ట్రేషన్లు
ఒకే భూమి నలుగురైదుగురికి అమ్మకం
ఎస్‌ఎంపురంలో టీడీపీ నాయకుల
భూ బాగోతం
మోసపోయిన కొనుగోలుదారులు


