29,30 తేదీల్లో ఎస్సీ కమిషన్‌ సభ్యుడి పర్యటన | - | Sakshi
Sakshi News home page

29,30 తేదీల్లో ఎస్సీ కమిషన్‌ సభ్యుడి పర్యటన

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 29, 30 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 29న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. మధ్యాహ్నం పలు భూ సమస్యలపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారు. 30న ఉదయం 10:30 గంటలకు మందస తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. మధ్యాహ్నం భూవివాదాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులతో మాట్లాడతారు.

వైభవంగా ఆదిత్యుని కల్యాణం

అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం కల్యాణ సేవ ఘనంగా నిర్వహించారు. అధిక జ్యేష్ట శుద్ద ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయాదేవేరులతో సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను కల్యాణమూర్తులుగా అలంకరించి కల్యాణం జరిపించారు. రూ.500 చెల్లించిన భక్త దంపతులకు స్వామి వారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, కల్యాణ తలంబ్రాలు అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ పాల్గొన్నారు.

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

నరసన్నపేట: త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఒకప్రకటనలో కోరారు. దానంచేయడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం పండగ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌: బక్రీద్‌ పండగ మత సామరస్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని.. కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్‌ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మసీదుల వద్ద బందోబస్తు, డ్రోన్స్‌, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని తిరువీధి

జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో బుధవారం సాయంత్రం మధుకేశ్వరుని తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పల్లకిలో ఆశీనులుగా చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు నడు మ ఊరేగింపు నిర్వహించగా భక్తులు హారతులిచ్చారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement