హడలిపోతున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో మరో కీలక వికెట్ పడిపోయేది. ముఖ్య నేత టార్చర్ భరించలేక ఏకంగా కీలక ఉద్యోగి దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయినట్టు సమాచారం. బడానేత తీరుతో విసిగి వేసారిపోయిన ఉద్యోగి.. ఆయన చెప్పినదంతా చేయాలంటే కష్టమని, ఇక్కడ పనిచేయడం కంటే తప్పుకోవడమే మంచిదన్న ఆలోచనకు వచ్చేసి, నాలుగు నెలల సెలవు పెట్టేసి, కార్యాలయం సిబ్బందికి ఫోన్ ఇచ్చేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. సమాచారం తెలుసుకున్న బడా నేత మంగళవారం రాత్రి రంగంలోకి దిగి సదరు అధికారిపై ఒత్తిడి తేవడంతో సెలవును రద్దుచేసుకున్నట్టు సమాచారం. ఇదే మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
ఎందరో బాధితులు..
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో బడా నేత సతాయింపులు భరించలేక అధికారులు వెళ్లిపోవడం కొత్తేమీ కాదు. గతంలో ఇక్కడ మున్సిపల్ ఇంజినీర్లుగా పనిచేసిన దక్షిణామూర్తి, కమలాకర్ ఏకంగా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) వెళ్లిపోగా, మున్సిపల్ ఇంజినీర్‌గా పనిచేసిన మరో అధికారి శ్రీనివాసులు కూడా దీర్ఘకాలిక సెలవు పెట్టేసి వెళ్లిపోయారు. మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన పీవీవీడీ ప్రసాదరావు కూడా బడా నేత ఒత్తిళ్లు, ఇబ్బందులు భరించలేక బదిలీపై వెళ్లిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన వేధింపులే కారణమన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇక్కడితో ఆగుతుందనుకుంటే పొరపాటే. సిటీ ప్లానింగ్‌లో పనిచేస్తున్న మరో ఇద్దరు కూడా బదిలీ కోసం యత్నిస్తున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో మరో ఇంజినీర్ పి.కమలాకర్ బడా నేత చెప్పిన పనులన్నీ చేయలేక, అడ్డగోలుగా బిల్లులు చెల్లించలేక, నోటి దురుసును తట్టుకోలేక తప్పుకున్నారు. అంతకుముందు దక్షిణామూర్తి, శ్రీనివాస్‌లు కూ డా అదే రకమైన బాధితులు. ఇక గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ప్రసాదరావైతే రథసప్తమి వేడుకల కోసం కార్పొరేషన్ నిధులను తోడేస్తున్నారని, తానైతే ఖర్చు పెట్టలేనని చెప్పి హుటాహుటిన బదిలీపై వెళ్లిపోయారు.
చెప్పినట్టి చేస్తేనే..
ప్రతీదీ తనకు తెలిసే జరగాలని, ఫైలు కూడా తన దృష్టికి వచ్చాకే కదలాలని, ఎవరినైనా మార్చాల న్నా తన అనుమతితో జరగాలని, ఇలా రక రకాలుగా టార్చర్ చేయడంతో తట్టుకోలేకనే కీలక ఉద్యోగి క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచా రం. కాంట్రాక్టర్లకు బిల్లులకు సంబంధించి, తా త్కాలిక ఉద్యోగుల సీట్ల మార్పు గురించి పేచీ ఏర్పడినట్టు తెలిసింది. ముఖ్యంగా హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పనిచేసిన ఓ వికలాంగ ఉద్యోగి బాధ లు చూసి కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకురావడాన్ని ఆ బడా నేత జీర్ణించుకోలేకపోయారు. అలాగే, ఆరోపణలతో గతంలో బదిలీ అయిన ఓ ఉద్యోగిని వెనక్కి తీసుకురావాలన్న ఒత్తిళ్లను అమలు చేయలేదన్న అక్కసు కూడా కారణమని తెలుస్తోంది. అలాగే, పాలన పరమైన నిర్ణయాల్లో వేలు పెట్టి ఇబ్బంది పెట్టడం, తన అభిప్రాయం మేరకే నడుచుకోవాలన్న ఆంక్షలు కీలక ఉద్యోగిని అంతర్మథనంలో పడేసినట్టు తెలిసింది. ఆత్మాభి మానాన్ని చంపుకుని ఎన్నాళ్లు పనిచేయగలమని సెలవుకు సిద్ధమయ్యారని ప్రచారం.
శ్రీకాకుళం నియోజకవర్గంలో పనిచేయడానికి అధికారులు భయపడిపోతున్నారు. బడానేత టార్చర్ భరించలేక హడలెత్తిపోతున్నారు. చెప్పినట్టు చేయాలని నేత హుకుం జారీ చేస్తున్నారు. సూచించినట్టు బిల్లులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆదేశించిన వారి పై చర్యలు తీసుకోవాలని పీకమీద కత్తి మీద పెడుతున్నారు. ఇవన్నీ అధికారులకు ప్రాణ సంకటంగా మారాయి. చర్యలు తీసుకోకపోతే బడా నేత పోరు పడలేకపోతున్నారు. చర్యలు తీసుకుంటే పాలనాపరంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి నోటికి పనిచెబుతున్నారు. కొంతమందైతే ఆ బూతులు భరించలేక ఇక్కడి నుంచి వెళ్లిపోయారు.
కార్పొరేషన్‌లో బడా నేత టార్చర్ భరించలేక సెలవు పెట్టిన కీలక ఉద్యోగి
ఆత్మాభిమానం చంపుకోలేక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
బయటకు పొక్కడంతో రంగంలోకి బడా నేత..
మంగళవారం రాత్రి కార్పొరేషన్‌లో రసవత్తర పరిణామాలు
బడా నేత ఒత్తిడితో సెలవును రద్దు చేసుకున్న కీలక ఉద్యోగి
మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆగని వేధింపులు, సతాయింపులు, బూతు పురాణాలు
వరుసగా వీఆర్‌ఎస్, సెలవుపై వెళ్లిపోతున్న మున్సిపల్ అధికారులు
రోజురోజుకీ పెరుగుతున్న బడా నేత బాధితులు


