నరసన్నపేట: మండలంలో వివిధ పురుగు మందుల షాపుల్లో ఉన్న 800 లీటర్ల పారా క్వాట్ డైక్లోరైడ్ 24 శాతం ఎస్‌ఎల్, దాని అన్ని ఫార్ములేషన్లపై నిషేధం ఉన్నందున ఈ మందు విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వ్యవసాయాధికారి వై.సూర్యకుమారి తెలిపా రు. వారం రోజులుగా పురుగుల మందుల దుకాణాల్లో తనిఖీలు చేసి 800 లీటర్లు ఉన్నట్లు గుర్తించి ఆయా షాపుల యజమానులకు అమ్మకాల నిలుపుదల ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపా రు. ఈ మేరకు ఆమె తన కార్యాలయంలో మంగళవారం వివరించారు. దీన్ని డీలర్లు అమలు చేయాలని, ఆదేశాలు పాటించక విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కొత్తూరు ిసీహెచ్‌సీ తనిఖీ
కొత్తూరు: కొత్తూరు సీహెచ్‌సీని డీహెచ్‌ఎస్ విజయలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీహెచ్‌సీలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది వైద్యం సక్రమంగా అందిస్తున్నప్పటికీ వసతులు కొరవడంతో అవస్థలు పడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె వైద్యులతో మాట్లాడారు. అదనపు భవన నిర్మాణాలు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సూపరింటెండెంట్ కిశోర్ కుమార్, పలువురు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్‌కు వడదెబ్బ
మెళియాపుట్టి: మండలకేంద్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాంబాబు వడదెబ్బకు గురవడంతో బస్సు అదుపు తప్పింది. అయినా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. హిరమండలం నుంచి పలాస వెళ్లే ఆర్టీసీ బస్సు మెళియాపుట్టి గ్రామం వద్దకు వచ్చే సరికి డ్రైవర్‌కు వడదెబ్బ తగలింది. అయినా ముందు బస్సును అదుపు చేశారు. వెంటనే స్థానికులు ఆయనను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. బస్సును రెండు గంటల పాటు నిలిపివేశారు.
పరిశ్రమ పైపులైన్ తవ్వేశారని రైతులపై ఫిర్యాదు
రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో వల ఎపీటోరియా పరిశ్రమ వాటర్ పైపులైన్‌ను స్థానిక రైతులు తవ్వేశారని పోలీసులకు పరిశ్రమ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లగానే స్థానిక రైతులు నీలాపు రమణ, అప్పలరాజు, బావిశెట్టి గోవింద, కాజా కన్నయ్య, నాగరాజు, దంగుడువీపు వెంకటప్పారావు, సతీష్‌లు తమ భూముల్లో పనులు చేసుకుంటూ ఉండగా పైప్‌లైన్ జేసీబీకి తగిలి పగిలిందని, తాము పగలగొట్టలేదని వివరించారు. తమ భూముల్లో పైపులు వేసి తిరిగి తమపైనే ఫిర్యాదు చేయ డం సరికాదన్నారు. పైప్‌లైన్ వేసినప్పుడు ఉపాధి కల్పిస్తామని చెప్పి మాట తప్పారని, ఉపాధి ఇవ్వలేకుంటే తమ భూముల్లో వేసిన పైపులైన్లు తొలగించాలని తెలిపారు.
నేడు బొడ్డపాడులో జిల్లా అమరవీరుల స్మారక సభ
పలాస: పలాస మండలం బొడ్డపాడు జిల్లా అమరవీరుల స్మారక మందిరం వద్ద బుధవారం ఉదయం జిల్లా అమరవీరుల స్మారక సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం స్మారక మందిరం వద్ద స్మారక కమిటీ నిర్వాహక కమిటీ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. 1969లో జరిగిన శ్రీకాకుళం జిల్లా గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో మొత్తం 360 మంది అశువులు బాసారని తదనంతరం కూడా ఎంతో మంది మృతి చెందారని వారిని స్మరించుకోవడానికి ప్రతి ఏడాది మే 27న అమరవీరుల స్మారక సభను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఉద్దానం ప్రజలంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు.


