● 2026 ఏడాదికి సంబంధించి పోగొట్టుకున్న మొబైళ్లు బాధితులకు అందజేత
● 2023 నుంచి 2,718 ఫోన్లు అప్పగింత
● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : అనుకోని పరిస్థితుల్లో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించడం తమ బాధ్యతని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ ఏడాదిలో బాధితుల నుంచి వచ్చిన 955 ఫిర్యాదులకు గాను 680 ఫోన్లను ట్రేస్ చేశామని రూ. కోటి విలువైన 518 ఫోన్లను అప్పగించామన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
2023 నుంచి 2,718 మొబైళ్లు...
2023 నుంచి ఇప్పటివరకు ఇక్కడి పోలీసులు 2718 మొబైళ్లు ఫోన్లను రికవరీ చేశారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విశ్లేషించి జిల్లాలోనే కాక దూరప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు మళ్లించిన ఫోన్లను కూడా గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో సైబర్ సెల్ నిపుణులు, ఐటీకోర్ బృందాల కృషి ఎనలేనిదన్నారు. 2023లో 518, 2024లో 622, 2025లో 1060, 2026లో 518 ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు.
ఫిర్యాదు చేయండిలా.
మొబైళ్లను పోగొట్టుకున్న బాధితులు తక్షణమే ఆ పరిధి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పా టు సిఇఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా కూడా ఫోన్ బ్లాక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ వెబ్‌సైట్‌లో మొబైల్ వివరాలతో బ్లాకింగ్ రిక్వెస్ట్ నమోదు చేసుకోవాలన్నారు. పోర్టల్ ద్వారా ఫిర్యాదులు, పోలీస్‌స్టేషన్లలో అందిన సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ జిల్లా సైబర్, ఐటీ కోర్ బృందాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫోన్లను గుర్తిస్తారన్నారు. ఫోన్ పోగొట్టుకున్న తక్షణమే ఫిర్యాదు చేస్తే 90శాతం దొరికే చాన్స్ ఉంటుందని, పోర్టల్‌లో బ్లాక్ చేయకపోతే అదే మొబైల్‌తో సైబర్ కేటుగాళ్లు నేరాలకు పాల్పడే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీసీఎస్ సీఐ సూర్యచంద్రమౌళి, సైబర్ సెల్ సిబ్బంది పైలా శరత్‌చంద్ర, గిరి తదితరులు ఉన్నారు.


